వచ్చే ఏడాది జరగనున్న మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు గాను వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో రెండు రెడ్డి సామాజికవర్గానికి.. మరొకటి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్‌కు ఇచ్చారు. విశాఖ-శ్రీకాకుళం-విజయనగరానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్. అనంతపురం-కడప-కర్నూలుకు వెన్నపూస రవీంద్రరెడ్డి , చిత్తూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాల నియోజకవర్గానికి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిల పేర్లను ఖరారు చేశారు.
అనంతపురం-కడప-కర్నూలు ఉపాధ్యాయ నియోజక వర్గానికి పోటీ చేసే అంశంపైనా చర్చించారు. అక్కడ ఓటర్లను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని, అభ్యర్థిని తర్వాత ప్రకటిద్దామని సమావేశంలో నిర్ణయించారు. ఈ స్థానంలో పోటీ చేస్తే సహజంగానే రెడ్డి సామాజికవర్గానికి అవకాశం కల్పిస్తారు. అగతంలో గుంటూరు లాంటి చోట్ల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి కూడా కల్పలతా రెడ్డి అనే ఆమెకు చాన్సిచ్చారు. అయితే వైసీపీ తరచూ చెప్పే సామాజిక న్యాయం ఇక్కడ ఏమైందన్న చర్చ ప్రారంభమైంది.
ఎవరికైనా బడుగు, బలహీనవర్గాలకు మద్దతిస్తే తమ గొప్ప అని చెప్పుకుంటారు.. కానీ తాము ఇవ్వాల్సిన చోట మాత్రం ఎందుకివ్వరన్న వాదన వినిపిస్తోంది. మూడు స్థానాల్లో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీలు కాబట్టి కులం మతానికి పెద్దగా పట్టింపు ఉండదు. చదువుకున్న వారే ఓట్లేస్తారు. ఓట్లు నమోదు చేయించుకున్న వారిదే ఎక్కువ శాతం విజయం. అందుకే ఇక్కడ సామాజిక న్యాయం పాటిస్తే బాగుండేదన్న వాదన ఉంది. కానీ సీఎం జగన్ మాత్రం మూడు అగ్రవర్ణాలకే కేటాయించారు.