ఇది వరకు సినిమా అంటే ఆరు పాటలు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధన ఉండేది. నిన్నా మొన్నటి వరకూ ఇదే కొనసాగింది. అయితే… ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జనాల్లోకి చేరువ అవ్వడానికి అనుకొంటున్నారు. అయితే పాటలు లేకుండా సినిమాలు తీయడం అరుదైన విషయమే. అది కూడా కమర్షియల్ హీరోల సినిమాలకు. విజయ్ దేవరకొండ ఇప్పుడు అలాంటి ప్రయోగమే చేస్తున్నాడు. విజయ్ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఇందులో పాటలు ఉండవు. కేవలం నేపథ్య సంగీతం మాత్రమే వినిపిస్తుంటుంది. అనిరుథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. అనిరుథ్ ట్యూన్స్ హాంటింగ్ గా ఉంటాయి. ఆల్బమ్‌లో ఆరు పాటలుంటే నాలుగు సూపర్ హిట్లు అవుతాయి. అలాంటి అనిరుథ్ ని పెట్టుకొని కూడా.. పాటలే లేకుండా ప్రయోగం చేస్తున్నారంటే మెచ్చుకోవాల్సిందే. కథ మూడ్ ని పాటలు డిస్ట్రబ్ చేయకూడదని చెప్పి, ఈ నిర్ణయం తీసుకొన్నార్ట. ఇటీవల పాటలు లేకుండా సంచలనాలు సృష్టించిన సినిమాల్లో ‘ఖైదీ’ ఒకటి. ఆ సినిమాలో పాటలే ఉండవు. ఇప్పుడు రౌడీ సినిమాకూ అదే ఫాలో అవుతున్నారు. ఒకట్రెండు చిన్న బిట్ సాంగ్స్ ఉన్నా, అవి నేపథ్య సంగీతంలో హై ఎమోషన్స్ కోసం వాడబోతున్నట్టు టాక్. అంతే తప్ప, ప్రత్యేకంగా డ్యూయెట్లు, హీరో ఇంట్రడక్షన్ గీతాలంటూ ఉండవు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రేపటి నుంచి విశాఖపట్నంలో ప్రారంభం కాబోతోంది. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు.