అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, ఆయన సతీమణి ఉషా వాన్స్ ఇండియా పర్యటనకు వస్తున్నారు. సోమవారం వారు ఢిల్లీలో ల్యాండ్ అవుతారు. మంగళవారం, బుధవారం పర్యటనల్లో బిజీగా ఉంటారు. బుధవారం రోజు మళ్లీ అమెరికా తిరుగుపయనం అవుతారు. మూడు రోజుల పాటు టూర్లో ఆయన అమెరికా, భారత్ ల మధ్య టారిఫ్ల గురించి చర్చించే అవకాశం ఉంది.
జేడీ వాన్స్, ఉష దంపతులు మొదటగా ఢిల్లీ వచ్చి మంగళవారం జైపూర్ వెళ్తారు. బుధవారం ఆగ్రా సందర్శిస్తారు. దాంతో వారి పర్యటన పూర్తి అవుతుంది. జేడీ వాన్స్ , ఉష దంపతులు ఇండియా వస్తున్నారంటే ఎక్కువ మంది వారి పర్యటన దక్షిణాదిలో ఉంటుందా అని ఆరా తీస్తారు. ఎందుంటే ఉషా వాన్స్ తెలుగు బిడ్డ. ఆమె పూర్వికులు కృష్ణా జిల్లా నుంచి వెళ్లి చెన్నైలో స్థిరపడ్డారు. అక్కడ్నుంచి అమెరికాకు వెళ్లారని చెబుతారు. అయితే ఆమె బంధువులు ఎవరూ గ్రామాల్లో ఉన్నట్లుగా స్పష్టత లేదు.
ట్రంప్, జేడీ వాన్స్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత అమెరికాలో కీలక మార్పులు చేపడుతున్నారు. ట్రంప్ టారిఫ్ వార్ ప్రకటించారు. తర్వాత 90 రోజులు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మధ్య కాలంలో ఆయా దేశాలతో చర్చలు జరుపుతారు. జేడీ వాన్స్ ఆ పనిలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సారి ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు వారి టూర్ షెడ్యూల్లో దక్షిణాది కూడా ఉండే అవకాశం ఉంది.