కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి , సిఫార్సులు చేయడానికి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీని నియమించారు. కానీ ఆ కమిటీ లో ఒక్క దక్షిణాది వ్యక్తికీ చోటు దక్కలేదు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు నొక్కి చెబుతున్నారు. దక్షిణాదిలో బీజేపీ గెలవలేదని.. అందుకే వివక్ష చూపిస్తున్నారని ఆయన బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. హరీష్ రావు విమర్శలు చూస్తే.. అందులో నిజం ఉందన్న అభిప్రాయం వినిపిస్తుంది. ఎందుకంటే.. రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీలో ఒక్క దక్షిణాదికి చెందిన వ్యక్తి కూడా లేడు.
జమిలీ ఎన్నికలు దేశం మొత్తానికి సంబంధించినవి. నిపుణులను ఆయా కమిటీల్లో నియమించాలనుకున్నప్పుడు సమానత్వం చూడాలి. దక్షిణాది నుంచి నిపుణులే ఉండరన్నట్లుగా కేంద్రం వ్యవహారశైలి ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దక్షిణాది సమస్యలను… దక్షిణాది ప్రజల అభిప్రాయాలను కూడా జమిలీ ఎన్నికలపై కమిటీ తీసుకోవాలి . అందుకే.. కమిటీలో సగం మందిని దక్షిణాది వారిని నియమిచాలన్న అభిప్రాయం ఉంది. కానీ అలాంటి ప్రయత్నమే లేదు.
దక్షిణాదిపై కేంద్రం వివక్ష ఎక్కువగానే ఉంది . కేంద్ర మంత్రి వర్గంలో దక్షిణాది నుంచి అతి తక్కువ మంది ఉంటారు. ఒక్క యూపీ నుచి ఉన్న వారి కన్నా దక్షిణాది వారే తక్కువ. కీలక శాఖలు దక్కవు. అత్యంత కీలక పదవులన్నీ ఉత్తరాది వారే అనుభవిస్తూ ఉంటారు. చివరికి ఇలాంటి కీలక కమిటీల్లోనూ దక్షిణాది వారికి చోటివ్వడం లేదన్న విమర్శలు బీఆర్ఎస్ వంటి పార్టీల నుంచి వస్తున్నాయి.