ఎవ్వరూ ఊసుపోక ఉద్యమాలు చెయ్యరు. కానీ, భాజపా దృష్టిలో ఆంధ్రాలో జరుగుతున్నదీ, పార్లమెంటులో టీడీపీ చేస్తున్నదీ అలాంటి ఊసుపోనితనం మాదిరిగా కనిపిస్తోందేమో..! భాజపా తీరుపై ఏపీ ప్రజల్లో ఇప్పటివరకూ వ్యతిరేకత మాత్రమే పెరుగుతూ వస్తోంది. దాన్ని అసహ్యించుకునే స్థాయికి వారే దిగజార్చుకుంటున్నారు. రానురానూ భాజపా నిర్లక్ష్యం ఏ స్థాయికి చేరిందంటే.. ఆంధ్రా సమస్యలపై వెటకారంగా వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో ఏపీ మంత్రి యనమల బృందం సోమవారం భేటీ అయిన సంగతి తెలిసిందే. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సినవీ, రెండేళ్ల కిందట ప్యాకేజీ పేరుతో ప్రకటించినవీ ఇవ్వాలనే డిమాండ్ ను మరోసారి కేంద్రం ముందుంచారు. అయితే, దీనిపై ఆర్థిక శాఖ వర్గాల్లో కొంత చర్చ జరిగినట్టు సమాచారం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అసాధ్యమని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు ఓ అంచనాకి వచ్చినట్టు తెలుస్తోంది. ప్యాకేజీ వైపే మొగ్గు చూపారట. కానీ, ఈశాన్య రాష్ట్రాల తరహాలో రాయితీలకు మాత్రం కేంద్రం ససేమిరా అంటోంది..! ఆంధ్రాకి రాయితీలు ఇస్తే యూపీ, బీహార్, బెంగాల్ వంటి రాష్ట్రాలు డిమాండ్ చేసే అవకాశం ఉందనే పాత వాదననే మళ్లీ వినిపించాలని కేంద్రం భావిస్తోంది. ఆత్మగౌరవం అంటూ ఆంధ్రా నేతలు సెంటిమెంట్ తో రాజకీయాలు చేయాలని చూస్తున్నారనీ, వీటికి తలొగ్గితే రేప్పొద్దు తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాలు కూడా ఇదే తరహాలో ఒత్తిడి పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారట..! అక్కడితో ఆగితే వ్యతిరేకత మాత్రమే పెరిగేది. కానీ, రేప్పొద్దున్న ” రక్షణ శాఖకు అన్ని నిధులు ఎందుకని అడిగినా అడుగుతారనీ, ఇప్పుడేమీ యుద్ధం జరిగిపోవడం లేదు కదా.. ఆర్మీకి కేటాయించిన నిధులను ఆంధ్రాకు ఇమ్మనేలా ఉన్నారనీ ” .. అంటూ ఆర్థిక శాఖ అధికారులు వ్యాఖ్యానించినట్టుగా సమాచారం.
విభజన చట్టంలోని హామీలు, హోదాకి బదులుగా ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ… ఇవే కదా కేంద్రాన్ని ఆంధ్రా అడుగుతున్నది. ఈరోజు అసెంబ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని మరోసారి చాలా స్పష్టంగా చెప్పారు. హక్కులను అడుగుతుంటే ఆర్థిక శాఖ అధికారుల స్పందనలో అంత వెటకారం ఎందుకు..? ఇచ్చే స్థానంలో తాము కూర్చున్నామన్న అహమా, లేదా అడుగుతున్న స్థాయిలో ఆంధ్రా నిలబడి ఉందన్న చిన్నచూపా..? సెంటిమెంట్లకు లొంగితే ఇతర రాష్ట్రాలు ఒత్తిడి పెంచుతాయని తీరిగ్గా చెబుతున్నారే… ఇలాంటి సెంటిమెంట్ కి లొంగే కదా రాష్ట్ర విభజనకు భాజపా మద్దతు పలికింది..! అంటే, సెంటిమెంట్ అనే మాటకు అప్పుడో రకమైన అర్థం, ఇప్పుడో రకమైన అర్థం వారికి కనిపిస్తోందా..? ఏపీ ప్రజల మనోభావాలపై భాజపాకి ఏమాత్రం గౌరవం లేదనడానికి ఇదే సాక్ష్యం. ఒకవేళ ఉంటే, రక్షణ శాఖ నిధుల ఉపమానంతో వెటకారంగా మాట్లాడరు..! హక్కులను అడుగుతుంటే అవమానకరంగా చూడ్డం వారికి అలవాటేమోగానీ, ఇతర శాఖల నిధులను అడిగేంత అవగాహనా రాహిత్యం ఆంధ్రులకు లేదు. ఏతావాతా భాజపాకి అర్థం కాని విషయమేంటంటే.. ఆంధ్రుల ఆత్మగౌరవం స్థాయి ఏపాటిదో అనేది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు అది అనుభవమైంది. వచ్చే ఎన్నికల్లో అదే అనుభవం భాజపాకి తప్పేట్టు లేదు.