కడప ఉక్కు కర్మాగారం సాధించుకునే వరకూ పోరాటం చేస్తామంటూ తాజాగా టీడీపీ ఎంపీ సీఎం రమేష్ దీక్ష చేశారు. కంటి తడుపు చర్యలే తప్ప.. కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదు! ఇప్పుడు, రైల్వేజోన్ ఇచ్చే వరకూ పోరాటం తప్పదంటూ మరో ఎంపీ దీక్షకు దిగారు. అయితే, ఏపీ విషయంలో కేంద్రం మూడ్ మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ఏపీలో ఎన్ని దీక్షలు జరిగినా.. ఎన్ని పోరాటాలు చేసినా నరేంద్ర మోడీ సర్కారు కొత్తగా స్పందించే పరిస్థితి లేదు. ఇదే విషయానికి ఒకటికి రెండుసార్లు నొక్కి మరీ చెబుతోంది. అది కూడా సుప్రీం కోర్టుకే ఈ విషయాన్ని మరోసారి తాజాగా కేంద్రం స్పష్టం చేయడం విశేషం..!
విభజన హామీల అమలుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలనీ, పోలవరం ముంపుపై అధ్యయనం వంటి అంశాల మీద చర్యలు తీసుకునేలా కేంద్రానికి ఆదేశించాలంటూ పొంగులేటి సుధాకర్ రెడ్డి సుప్రీం కోర్టులో తాజాగా ఒక పిటీషన్ వేశారు. ఇది తాజాగా విచారణకు వచ్చింది. వీటిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ ధర్మాసనం కోరింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. దీన్లో చాలా స్పష్టంగా కోర్టుకు చెప్పింది ఏంటంటే… గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం అసాధ్యమని. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని అధికారికంగా సుప్రీం కోర్టుకు కేంద్రం తేల్చి చెప్పింది. అయితే, ఇదే సందర్భంలో ప్రత్యేక ప్యాకేజీ ఊసెత్తకపోవడం గమనార్హం. అది ఎంతవరకూ వచ్చింది, అమలు సంగతేంటనేది స్పష్టం చెయ్యలేదు. ఏపీ రెవెన్యూ లోటు ఇప్పటికే చాలావరకూ ఇచ్చేశామంటూ లెక్కలు చెప్పింది. రాజధాని నిర్మాణానికి ఇప్పటివరకూ రూ. 2,500 కోట్లు ఇచ్చామని చెప్పింది. పోలవరం, రైల్వే జోన్ వంటి అంశాల ఊసే అఫిడవిట్ లో లేదు. దుగరాజపట్నం పోర్టు మాత్రం పరిశీలనలో ఉందన్నారు!
కడప స్టీల్ ప్లాంట్ పై కూడా ఇలాంటి అఫిడవిట్టే కేంద్రం సుప్రీంలో దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రంలో అనూహ్యంగా విమర్శలు పెరగడంతో.. పరిశీలనలో ఉందనీ, రాష్ట్రమే మెకాన్ కు నివేదికలు ఇవ్వాలంటూ మెలిక పెట్టేసింది. రాష్ట్రంలో ప్రత్యేక హోదాపై అధికార ప్రతిపక్షాలతోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పోరాటం చేస్తున్నారు. హోదా ఇచ్చే వరకూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతామనే అందరూ అంటున్నారు. కానీ, కేంద్రం మాత్రం ఆ ఒత్తిడిని ఏమాత్రం ఫీల్ కావడం లేదు. వీలైన ప్రతీచోటా హోదా సాధ్యం కాదూ కాదూ అని స్పష్టం చేస్తూనే ఉంది. ఏపీలో భాజపాపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నా… రాజకీయంగానైనా ఆ పోరాటాలకు భాజపా కనీసం స్పందించకపోవడం గమనార్హం.