ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడం అనే అంశం పూర్తిగా చంద్రబాబునాయుడు వైఫల్యమే అంటూ ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి విరుచుకుపడ్డారు. ప్రత్యేకహోదా అనేది కేంద్రం ఇవ్వకపోవడం అనేది కాదు, అసలు వైఫల్యం దాన్ని అడగకపోవడంలోనే ఉన్నదని.. వైఎస్ జగన్ తేల్చిచెప్పారు. హోదా విషయంలో ఎన్నికలకు ముందు.. చాలా బలంగా డిమాండ్ చేయడం దగ్గరినుంచి.. పదేళ్లు కూడా పదిహేనేళ్లు ఇవ్వాల్సిందిగా తాను నరేంద్రమోడీని కోరానని చెప్పడం దగ్గరినుంచి… హోదా వస్తే స్వర్గమైపోతుందని అంటున్నారు.. ఏమైపోతుందండీ.. అంటూ నిరసనగా మాట్లాడడం వరకు వేర్వేరు సందర్భాల్లో చంద్రబాబు మాట మార్చిన తీరును వీడియో క్లిప్పింగుల ద్వారా ప్రదర్శించి మరీ వైఎస్ జగన్ చంద్రబాబు తీరును ఎండగట్టారు.
కేంద్రానికి చంద్రబాబు ఎందుకు అల్టిమేటం ఇవ్వడం లేదో అర్థం కావడం లేదని జగన్ నిలదీశారు. ఏపీని ఢిల్లీ పాలకుల వద్ద చంద్రబాబు పూర్తిగా తాకట్టు పెట్టాడని జగన్ విమర్శించారు. ప్రత్యేక హోదా ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒనగూరగల ప్రయోజనాల గురించి ఆయన ఏకరవు పెట్టారు. హోదా తేలేని తెదేపా కేంద్రమంత్రులు కేబినెట్ నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోరాటం చేయాల్సిన వ్యక్తి రాష్ట్రాన్ని గాలికి వదిలేశారని ఆరోపించారు.
పదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తాం అంటూ భాజపా వారు తమ మేనిఫెస్టోలో పెట్టి ప్రచారం చేశారంటూ ఆయన వారి వైఫల్యాన్ని కూడా ఎత్తిచూపారు. ఇవాళ ఏపీకి హోదా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ కేంద్ర మంత్రులు మాట్లాడుతోంటే చంద్రబాబు స్పందించడం లేదంటూ జగన్ ఆరోపణలు గుప్పించారు.
చంద్రబాబు తీరుతో రాష్ట్రానికి అనేక రకాలుగా నష్టం వాటిల్లుతున్నదని… పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ను అడ్డగోలుగా నిర్మిస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆయన ఆరోపించారు. ఇంకా నీటివనరుల విషయంలో తెలంగాణ ప్రాజెక్టుల వల్ల కలుగుతున్న నష్టాలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని జగన్ ఆరోపించారు.