ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హౌదా ఇవ్వదనే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముందే తెలియజేశామని బిజెపి నేతలు చెబుతున్నారు.. నరేంద్ర మోడీతో ఆయనకు మొదటినుంచి ఈక్వేషన్ సరిగ్గాలేదని వారంటారు. రాజకీయ అవసరాలకోసం కూడా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని మోడీ పెద్దగా కోరుకోలేదని ఒక కార్పొరేట్ సంస్థ ప్రోద్బలం వల్లనే ఆఖరుకు ఆయన అంగీకరించాల్సి వచ్చిందని వారంటారు. ఆ సంస్థకు ఒక మీడియా మొఘల్కూ వున్న సంబంధం అందరికీ తెలుసు. టిడిపి బిజెపి రాజకీయ ప్రయోజనాల మధ్య ఘర్షణ వున్నా ఉభయులకూ ఆర్థికంగా సహకరించిన ఆ సంస్థ మాట కాదనే పరిస్థితి లేకనే ప్రధాని బలవంతపు స్నేహం కొనసాగిస్తున్నారని బిజెపి నేతల కథనం. చంద్రబాబు తానే మోడీ కన్నా సీనియర్‌ను అనుకోవడం, గుజరాత్ మతకలహాల సమయంలో వాజ్‌పేయిని మాటలు నమ్మి మోడీ దిగిపోవాలని కోరడం కూడా ఆయన మర్చిపోలేదని వారంటారు. స్వతహాగా కక్ష సాధింపు మనస్తత్వం గల మోడీ అద్వానీనే క్షమించనప్పుడు చంద్రబాబును ఉదారంగా చూసే ప్రశ్న ఉత్పన్నం కాదంటారు. అందుకే ఎన్నిసార్లు కలిసినా పొడిపొడిగా ముగించడం తప్ప మనస్పూర్తిగా స్పందించిన సందర్భం లేదని వారు గుర్తు చేస్తున్నారు.
మోడీ మాత్రమే గాక అమిత్‌షా కూడా అనేకసార్లు చంద్రబాబు అతిచేస్తున్నట్టు వ్యాఖ్యానిస్తుంటారట. తనకు ఎలా పాఠం చెప్పాలో మాకు తెలుసని ఆయన ఒకసారి మామూలు కార్యకర్తల ముందే అన్నారని సమాచారం.వచ్చే ఎన్నికల నాటికి ఎలాగూ చంద్రబాబు ప్రభుత్వంతో కలసి ప్రయాణించలేమని మోడీ అమిత్‌షా భావిస్తున్నా పైన చెప్పిన కార్పొరేట్ ప్రభావం, వెంకయ్య నాయుడు జోక్యం వల్ల అరకొరగా కలసి నడుస్తున్నారు. బాబుతో స్నేహం వైరం అనేవి ఆయా నేతల అనుబంధాలను బట్టి తప్ప ఇంకా ఒక విధానం ఖాయం చేసుకోలేదని ఆ తర్వాత మరింత ఖచ్చితంగా వ్యవహరిస్తామని బిజెపి వర్గాలు అంటున్నాయి. చంద్రబాబు తమకు తగినంత గౌరవం ఇవ్వడం లేదనే ఫిర్యాదు వారందరిలో వుంది.
రాజకీయంగానే గాక తమకు సంబందించిన వ్యాపార వర్గాలకు కూడా విషయాలు తెలియడం లేదని అవకాశాలు రావడం లేదని ఒక్క వెంకయ్యనాయుడు సన్నిహితులకు పనులు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
ఇవన్నీ ఎలా వున్నా ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక హౌదా ఇవ్వకపోవడంపై తెలుగుదేశంనేతలలో తీవ్ర ఆగ్రహం వుంది. తీవ్రంగా మాట్లాడేందుకు కూడా సిద్దమైనారు. అయితే ఈ సమయంలో చంద్రబాబు బ్రీఫింగ్లో మనం తొందరపడరాదని చెప్పడంతో చల్లబడిపోయారు.ముఖ్యమంత్రి ఇంతగా జంకడానికి కారణాలేమిటన్నది మాత్రం వారికి అంతుపట్టడం లేదు.
ఇప్పటి వరకూ ఎంతో ఓపిక పట్టినా లేని పలితం ఇకుముందు వుంటుందనే నమ్మకం లేకున్నా నాయకుడి మాట మేరకు మాట్లాడకుండా వుండిపోతున్నారు. మరో ఏడాది పోయాక మాట్లాడదామని ఆయన అనుకుంటున్నారు గాని ఈలోగా పరిస్థితులు మారిపోతే చొరవ చేయి జారిపోతే ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.. ఇక ప్రజల్లోనైతే అసంతృప్తి మరింత తీవ్రంగా వుంది. అది వామపక్షాలు ప్రజాసంఘాలు ఇతర ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనగా మారినా ఆశ్చర్యం లేదు. జెఎసిలు కూడా ఏర్పడే అవకాశముంటుంది. అప్పుడు అనివార్యంగా తెలుగుదేశం గొంతు కలపాల్సి వస్తుంది. రాష్ట్రమంతటికీ సంబంధించిన సమస్యపై చంద్రబాబు ఎందుకు అఖిలపక్షం పిలిచి అందరి మద్దతు కోరడం లేదన్నది తెలుగుదేశం నేతలకు ఆశ్చర్యంగా వుంది. దానివల్ల ఒరిగేది లేకున్నా బాధ్యత అందరిపై మోపినట్టు వుంటుందని సంప్రదించినట్టు వుంటుందని కూడావారంటున్నారు.ఇప్పటికైతే నుంచి ఆ విధమైన సంకేతాలు లేవు.