ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనపై విధించిన సస్పెన్షన్ చట్ట వ్యతిరేకమని.. వెంటనే ఎత్తివేస్తూ ఆదేశాలివ్వాలని మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పెట్టుకున్న పిటిషన్ పై క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. సస్పెన్షన్ పై స్టే ఇవ్వాలని ఏబీ వెంకటేశ్వరరావు తరపు న్యాయవాది క్యాట్‌ను కోరారు. అయితే.. స్టే ఇవ్వడానికి క్యాట్ నిరాకరించింది. ప్రభుత్వం తరపున వాదించడానికి వచ్చిన లాయార్ ప్రకాష్ రెడ్డిపై మాత్రం.. ప్రశ్నల వర్షం కురిపించింది. డీజీ స్థాయి అధికారిని కేంద్రం అనుమతి లేకుండా ఎలా సస్పెండ్ చేశారని ప్రశ్నించింది. సస్పెన్షన్ తర్వాత హోంశాఖకు సమాచారం ఇచ్చారా అని క్యాట్ న్యాయమూర్తి ప్రశ్నించారు.
అయితే.. తమకు ఉన్న అధికారంతోనే.. డీజీ స్థాయి అధికారి అయినప్పటికీ.. ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశామని ప్రభుత్వం తరపు న్యాయవాది క్యాట్‌కు తెలిపారు. ఐపీఎస్ అధికారికి 8 నెలలుగా జీతం ఎందుకు ఇవ్వలేదని క్యాట్ ప్రశ్నించారు. మొత్తం వివరాలు చెప్పాలంటే…తనకు వారం రోజులు గడువు కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది క్యాట్ ను కోరారు. దాంతో.. విచారణను.. ఇరవై నాలుగో తేదీకి వాయిదా వేసింది. ఎందుకు సస్పెండ్ చేసిందో.. ప్రభుత్వం ఎలాంటి వివరాలు చెప్పకపోవడం వల్లనే.. సస్పెన్షన్ పై క్యాట్ స్టే ఇవ్వలేదని ఏబీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర సర్వీసులో ఉన్న అధికారుల్ని ఏపీ సర్కార్ సస్పెండ్ చేస్తూండటం.. వారు క్యాట్‌లో పిటిషన్లు వేస్తే.. వివరాలు లేవని న్యాయవాదులు చెప్పడం కామన్ గా మారింది. జాస్తి కృష్ణకిషోర్ అనే ఐఆర్ఎస్ అధికారి విషయంలోనూ అలాగే జరిగింది. జీతం చెల్లించమని క్యాట్ ఆదేశించిన చెల్లించలేదు. చివరికి సీఎస్‌ను పలిపిస్తామని హెచ్చరించడంతో అప్పటికప్పుడు జీతం ఇచ్చినట్లుగా క్యాట్ కు తెలిపారు. ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది.