ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం నేతలు తమ పరువు రోడ్డున పడేసుకున్నారు. తమకు ఏ మాత్రం పలుకుబడి లేదని నిరూపించేసుకున్నారు. సచివాలంయలో రోడ్డు మీద ఆరు గంటల పాటు చూసిచూసి ఇంటికెళ్లిపోయి.. ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. వీరి తీరుతో ఉద్యోగులంతా హతాశులయ్యారు. పైగా వీరంతా తాము రెండు చేతుల్లో జగన్ను గెలిపించామని.. అయినా పట్టించుకోవడం లేదని అడిగినా అడగకపోయినా చెబుతున్నారు. వీరి తీరుతో అటు అధికార పార్టీ దగ్గరకు రానివ్వదు.. ఇటు ప్రతిపక్షం కూడా వీరికి ఇలా జరగాల్సిందేనన్న ఓ రకమైన అభిప్రాయంతో ఉండిపోతోంది.
ఇప్పటి వరకూ ఉద్యోగ సంఘాల నేతలు తమ ఉద్యోగుల ప్రయోజనాలకే పెద్ద పీట వేసేవారు. ప్రభుత్వతంతో సన్నహితంగా ఉన్నప్పటికి అశోక్ బాబు ఉద్యోగ సంఘం నేతగా ఉన్నప్పుడు.. ఉద్యోగుల ప్రయోజనాల విషయంలో రాజీపడలేదు. ఆయన అనేక ప్రయోజనాలు కల్పించారు. కానీ ఇప్పుడు ఉద్యోగ సంఘం నేతలు ప్రభుత్వ మెప్పు కోసం అత్యంత దారుణంగా రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎస్ఈసీపై కూడా ఎదురు తిరిగారు. కానీ వీరికి ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం కూడా ప్రభుత్వానికి ఇష్టం లేకపోగా ఇచ్చినప్పుడుతీసుకోవాలని ఆర్థిక మంత్రి ఓ సలహా పడేశారు.
ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే ఏపీ ప్రభుత్వం ఉన్న ఆర్థిక సమస్యల కారణంగా ఒక్క రూపాయి కూడా అదనంగా పీఆర్సీ రూపంలో ఇచ్చే అవకాశం లేదు. డీఎలు కూడా ఇచ్చే దిక్కులేదు. కానీ ఉద్యోగులకు ఎవరి వద్ద నుంచి మద్దతు లభించడం లేదు. ఎవరూ కూడ పాపం ఉద్యోగులు అనడం లేదు. అటు అధికార పార్టీ కూడా వారిని అవమానిస్తోంది. ఇంత దుర్భర పరిస్థితుల్లో ఉద్యోగుల్ని నెట్టేసిన ఘనత ఉద్యోగ సంఘ నేతలకే దక్కుతుంది. ఇప్పటికైనా తమ పట్టు గౌరవం నిలుపుకోవాలంటే పోరుబాట పట్టడమే మిగిలింది. ఇప్పటికి వంగి వంగి నడిస్తే.. ఇక ఉద్యోగుల ఐక్యత వెన్నుముక విరిగినట్లే. !