అధికారంలో ఉన్నప్పుడు అడ్డమైన పనులు చేసి.. ఇప్పుడూ అయ్యయ్యో అంటే ఎవరూ మాత్రం సానుభూతి ప్రకటిస్తారు? ఐదేళ్లు ఫ్యాక్షన్ రాజకీయాలకు ఏపీని అడ్డాగా మార్చిన జగన్, అధికారం కోల్పోయాక న్యాయం, చట్టం అంటూ మాట్లాడుతున్నారు. వంశీ అరెస్ట్ అన్యాయమని , అక్రమమని వాదిస్తున్నారు. అయినా, ఏవైపునుంచి వంశీ అరెస్ట్ పై వైసీపీకి కనీస మద్దతు లభించడం లేదు.
గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదుదారుడైన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీ అరెస్ట్ ను జగన్ ఖండించేశారు. రాజ్యాంగం గురించి హితబోధ చేశారు. వంశీని అరెస్ట్ చేయడం రాజ్యాంగానికి తూట్లు పొడవటం అని అసంబద్ధమైన ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చూసిన వారంతా రాజ్యాంగం, న్యాయం, చట్టం వైసీపీ హయాంలో అమలయ్యాయా అని ప్రశ్నిస్తున్నారు.
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారిని, రౌడీయిజం చేసే నేతలను ఇంకా ప్రోత్సహిస్తున్నారు. వంశీ లాంటి నేతల వ్యాఖ్యలు వైసీపీ కొంపముంచాయని వాస్తవం బయటపడినా..జగన్ మాత్రం వాటిని అంగీకరించే పరిస్థితిలో కనిపించడం లేదు. “నేను మొనార్క్ నన్నెవరూ మార్చలేరు” అనే తరహాలో వ్యవహరిస్తున్నారు. దీంతో..జగన్ ఇంకెప్పుడూ మారుతారోనని వైసీపీ క్యాడర్ సైతం నిట్టూరుస్తోంది.