ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ బీఆర్ఎస్ పెద్దల్ని బుక్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్రభాకర్ రావు అమెరికా వెళ్లి దాక్కోవడమే కాదు.. పెద్దల మొత్తంలో అమెరికాలో డబ్బులు పెట్టుబడి పెట్టి గ్రీన్ కార్డు కూడా తెచ్చుకున్నారు. దీంతో ఆయన తిరిగి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఆయనను రప్పించాలంటే కేంద్రం సపోర్టు ఉండాలి. నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం తీసుకు రావాల్సి ఉంది. అయితే కేంద్రం వైపు నుంచి స్పందన ఉండటంలేదు.
కేంద్రం నుంచి ఈ కేసులో సహకారం కోసం పోలీసులు విభిన్నంగా ప్రయత్నిస్తున్నారు. ట్యాపింగ్ బాధితుల్లో బీజేపీ నేతలు కూడా ఉన్నారనిచెబుతున్నారు. పోలీసుల ద్వారా సంకేతాలు పంపుతున్నారు. తాజాగా త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని ఏసీబీ అధికారులు తేల్చారు. ఈ మేరకు గవర్నర్ పీఏ నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. రైతు చట్టాల రద్దుతో పాటు చాలా కీలక విషయాలపై బీఆర్ఎస్కు ముందుగానే సమాచారం అందేది. అది ఎలా అనేది ఇప్పుడు మెల్లగా బయటకు తీస్తున్నారు.
గతంలో బీఎల్ సంతోష్ ను అరెస్టు చేయడానికి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఆ కేసు అంతా ఫోన్ ట్యాపింగ్ చుట్టే తిరుగుతోందని గతంలో బయట పెట్టారు.ఇప్పుడు గవర్నర్ ఫోన్ ట్యాప్ చేసినట్లుగా కూడా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం మరింత చురుకుగా స్పందించి.. ప్రభాకర్ రావును అమెరికా నుంచి రప్పించే ప్రయత్నాలకు సహకారం ఇవ్వాలని .. ప్రభాకర్ రావును రప్పిస్తే కేసు సగం సాల్వ్ అయిపోతుందని భావిస్తున్నారు. మరి కేంద్రం సహకరిస్తుందా ?