తెలంగాణలో పీసీసీ అధ్యక్ష పదవి కోసం నాయకులు పోటీ పడుతున్న పరిస్థితి! ఆంధ్రాలో ఆ పదవి అంటే… బాబోయ్ మాకొద్దు అంటూ నాయకులు ముఖం చాటేస్తున్న పరిస్థితి! అవునండీ… ఆంధ్రాలో కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక చేయాలని ఏఐసీసీ కసరత్తు ప్రారంభించింది. ఆంధ్రాలో త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలున్నాయనీ, అప్పట్లోగా కొత్త సారథి ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాలంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఉమెన్ చాందీకి ఏఐసీసీ సూచించినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని నేతల అభిప్రాయాలను తీసుకోవాలనీ, ఆశావహుల జాబితాను తయారు చేసి.. అభిప్రాయ సేకరణ కూడా చేయాలని ఆదేశించిందని సమాచారం. దీంతో ఇప్పుడు ఆంధ్రా కాంగ్రెస్ కి కొత్త సారథి ఎవరనే చర్చ మొదలైంది.
ఎన్నికల తరువాతి నుంచి రఘువీరారెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. బెంగళూరుకి మకాం మార్చి, వ్యాపార వ్యవహారాలకే పరిమితం అవుతున్నారు. పీసీసీ బాధ్యతల నుంచి తప్పుకున్న రఘువీరా పార్టీని పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. మరోసారి పార్టీ బాధ్యతలు తీసుకోవాలంటూ ఢిల్లీ పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా… ఆయన వద్దంటూ తప్పుకున్నారు. దీంతో ఇప్పుడు ఏపీలో కొత్త సారథిని అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, పదవి ఖాళీగా ఉందని తెలిసినా కూడా ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలెవ్వరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే, గత ఆరేళ్లుగా ఆంధ్రాలో కాంగ్రెస్ పరిస్థితి కుదేలైపోయింది. గత వైభవం తీసుకుని రావాలంటే… అంత సులువైన పనేం కాదు. కేడర్ లేదు, నాయకులు లేరు… పునాదుల నుంచి పార్టీని నిర్మించుకుని రావాలి. పైగా, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కొంత ఆస్కారం ఉండేది, కనీసం బలమైన ప్రతిపక్షంగానైనా పార్లమెంటులో పట్టున్నా బాగుండేది. ఈ నేపథ్యంలో ఏపీ బాధ్యతలు స్వీకరించడం ఎవరికైనా తలకుమించిన భారమే.
అయితే, కొంతమంది పేర్లు ఇప్పుడు ప్రచారంలోకి వస్తున్నాయి! మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపీ చింతా మోహన్ లు పీసీసీ పదవి మీద కొంత ఆసక్తితో ఉన్నట్టు వినిపిస్తోంది. ఈసారి మహిళలకు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయమూ ఉంది. అయితే, ఏఐసీసీ దృష్టిలో మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు ఉన్నారనీ, బాధ్యతలు స్వీకరించడానికి ఆయన సుముఖంగా లేరనీ తెలుస్తోంది. మొత్తానికి, ఏపీ పీసీసీ బాధ్యతలు ఎవరి చేతికి వస్తాయో వేచి చూడాలి.