నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ నేతల సందడి అంతా ఇంతా కాదు! కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అక్కడే మకాం వేసి, ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే, ప్రచారం విషయంలో టీడీపీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది! పైపైకి అభివృద్ధి అంటున్నా నంద్యాలలో కుల సమీకరణలు కూడా ముఖ్యమే కదా! వాటిని బాగా అర్థం చేసుకున్న టీడీపీ… నంద్యాలలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదనే విచక్షణను చాలా బాగా పాటిస్తోందని చెప్పొచ్చు. నంద్యాల ఎన్నికల్లో ప్రచార బాధ్యతల్ని రెడ్డి సామాజిక వర్గ నేతలకే ఎక్కువగా అప్పటించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి.. ఇలా వీళ్లే ఎక్కువగా ప్రజల ముందుకు వెళ్తున్నారు. అయితే, రాయలసీమకు చెందిన ప్రముఖ నేతలు, ఆ సామాజిక వర్గానికే చెందిన జేసీ దివాకర్ రెడ్డి సోదరులు నంద్యాలలో ఎందుకు కనిపించడం లేదు..? తెలుగుదేశంలో మంచి మాటకారిగా పేరున్న పయ్యావుల కేశవ్ మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు..? ఇదంతా వ్యూహాత్మకమే అని చెప్పొచ్చు.
నిజానికి, జేసీ దివాకర్ రెడ్డి నంద్యాల ప్రచారానికి వస్తారనే ముందుగా అనుకున్నారట. కానీ, జేసీ సోదరులు ప్రచారానికి వస్తే టీడీపీకి జరిగే మేలు కంటే.. నష్టమే ఎక్కువనేది వారి అంచనా! ఎందుకంటే, సీమ ప్రాంతంలో రెడ్డి సామాజిక వర్గంలోనే జేసీ సోదరులపై చాలా వ్యతిరేకత ఉందనీ, వారి చేష్ఠలు చాలామందికి నచ్చడం లేదనీ, ఇలాంటి పరిస్థితుల్లో దివాకర్ రెడ్డిని ప్రచారానికి తీసుకొస్తే.. ఆ సామాజిక వర్గం వారు టీడీపీని వ్యతిరేకించే అవకాశం ఉంటుందనేది లెక్కగా తెలుస్తోంది. పైగా, జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడ ఏం మాట్లాడతారో అనేది కూడా మరో టెన్షన్! ఆయనకు మైకు దొరికితే మాట అదుపులో ఉండదాయె అనే విమర్శ కూడా ఉంది. సొంత పార్టీని ఇరుకునపెట్టే విధంగా ఆయన ఎన్నోసార్లు వ్యవహరించారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని నంద్యాల ఉప ఎన్నిక అయ్యే వరకూ ఇటువైపు చూడొద్దనీ, దీని గురించి మాట్లాడొద్దంటూ వారిని కోరినట్టు చెప్పుకుంటున్నారు.
ఇక, పయ్యావుల కేశవ్ వంటి వారికి కీలక బాధ్యతలు అప్పగించకుండా, తెర చాటుకే పరిమితం చేయడం వెనక కూడా కుల సమీకరణలే అని చెబుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారికే ఎక్కువ బాధ్యతలు అప్పగిస్తే… అది కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందన్నది టీడీపీ అంచనాగా తెలుస్తోంది. నియోజక వర్గంలో వార్డుల వారీగా ప్రచారానికి ఎవరు వెళ్లాలీ.. మీడియా ముందు ఎవరు మాట్లాడాలీ.. సూచనలూ సలహాలూ అందిస్తూ తెర వెనక మాత్రమే ఎవరు ఉండాలి… ఇలా పని విభజన అంతా కుల సమీకరణ ఆధారంగానే చేసినట్టు చెప్పుకుంటున్నారు! ఏ
దేమైనా, టీడీపీ మేనేజ్మెంట్ నైపుణ్యాలను మెచ్చుకోవాల్సిందే! ఎక్కడ ఏది అవసరమైతే, అక్కడ అదే అస్త్రాన్ని ప్రయోగిస్తారు. తాజాగా విజయవాడలో జరిగిన కాపు సంఘాల నేతల సమావేశమే చూడండి… ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రే స్వయంగా వచ్చినా, నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షతన కార్యక్రమమంతా జరిగింది!