బుధవారం ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘ఆర్.ఆర్.ఆర్’ టీమ్ నుంచి ఓ టీజర్ వస్తుందని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అల్లూరి సీతారామరాజుని చూపించినట్టు… ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టిన రోజుకి కొమరం భీమ్‌ని చూపిస్తారన్నది అందిరి ఆశ, ఆలోచన.
అయితే.. లాక్ డౌన్ వల్ల తాము అనుకున్న సమయానికి టీజర్‌ని పూర్తి చేయలేకపోయామని, అందుకే ఈసారి ఫస్ట్ లుక్‌గానీ, టీజర్ గానీ చూపించడం కుదరడం లేదని ఆర్.ఆర్.ఆర్ టీమ్ స్పష్టం చేసింది. ఇది వరకు ఎన్టీఆర్ అభిమానులకు మాట ఇచ్చామని, ఆదరాబాదరగా ఏదో ఓ టీజర్‌ని విడుదల చేయలేమని, ఎన్టీఆర్ టీజర్ ఎప్పుడు బయట పెట్టినా అది అభిమానులకు ఓ పండగలా ఉండబోతోందని, అప్పటి వరకూ ఎదురు చూడమన్నట్టుగా ట్విట్టర్లో ఓ ప్రకటన విడుదల చేసింది ఆర్.ఆర్.ఆర్ టీమ్.
నిజానికి ఎన్టీఆర్ టీజర్ ని విడుదల చేద్దామని శతవిధాలా ప్రయత్నించారు. కాకపోతే.. టీజర్‌కి సరిపడేంత ఫుటేజ్ లేకుండా పోయింది. కొంతమేర ఫుటేజ్ ఉన్నా స్టోరీ బోర్డ్ (టీజర్‌కీ ఓ స్టోరీ బోర్డ్ ఉంటుంది) ప్రకారం కావాల్సిన ఫుటేజీ లేకుండా పోయింది. లాక్ డౌన్ ఎత్తేస్తే.. ఆ మేరకు షూటింగ్ జరిపి, టీజర్‌ని విడుదల చేద్దామనుకున్నారు. కనీసం ఫస్ట్ లుక్ అయినా చూపించాలని ఆశ పడ్డారు. కానీ.. అవేం జరగలేదు.