కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సీడ్ల్యూసీని పునర్వవస్థీకరించారు. అందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరంటే..ఒక్కరికీ చాన్స్ దక్కలేదు. 23 మందితో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించారు. వీరు కాకాకుండా.. 18 మంది శాశ్వత ఆహ్వానితులు, పది మంది ప్రత్యేక ఆహ్వానితులు కూడా సీడబ్ల్యూసీ జాబితాలో ఉన్నారు. ఈ యాభై మూడు మందిలో ఒక్కరంటే.. ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన నేత లేరు. ఏపీ, తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జులు ఊమెన్ చాందీ, కుంతియాలకు మాత్రం చోటు కల్పించారు. మిగతా అంతా దాదాపు పాతవారే ఉన్నారు.
యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అంటే దానికి కారణం…ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ సాధించిన అద్భుత విజయాలే కారణం. ఆ పరిస్థితి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు.. కనీసం సిడబ్ల్యూసీ స్థాయికి తగిన నెతలెవరు లేనంతగా దిగజారిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీనే నమ్ముకున్న కొంత మంది సీనియర్లు ఉన్నారు. తెలంగాణనూ.. జైపాల్ రెడ్డి లాంటి దిగ్గజాలు ఉన్నారు. వీరెవర్నీ.. కాంగ్రెస్ పార్టీ అధినేత పరిగణనలోకి తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పళ్లంరాజు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఇటీవలే పార్టీలో తిరిగి చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి లాంటి వాళ్లు ఉన్నా.. వారిని పరగిణనలోకి తీసుకోలేదు.
ఆంధ్రప్రదేశ్‌పై ఆ పార్టీకి ఆశల్లేవనుకున్నా.. తెలంగాణపై మాత్రం.. కాంగ్రెస్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. పైగా తెలంగాణలో.. పార్టీనే అంటి పెట్టుకుని.. హైకమాండ్ వద్ద పలుకుబడి సాధించిన నేతలు కూడా ఉన్నారు. జైపాల్ రెడ్డి , పొన్నాల, మధుయాష్కీ, వీహెచ్, రేణుకా చౌదరి లాంటి పెద్ద లీడర్లు కూడా లెక్కలోకి రాకుండా పోయారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇలా ఏ కోటాను… తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క నేత కూడా.. రాహుల్ గాంధీ కంటికి ఆనలేదు. జాతీయ స్థాయిలో దిగ్విజయ్ సింగ్, కమల్‌నాథ్ లాంటి నేతల్ని పక్కన పెట్టినా.. వారికి ఉన్న బాధ్యతల రీత్యా అలా సర్ధుబాటు చేశారనుకుందాం. కానీ ప్రత్యేకంగా తెలుగురాష్ట్రాల కాంగ్రెస్ నేతలపై.. రాహుల్ గాంధీ ఇలా శీతకన్నేయడం ఎవరికీ అర్థం కావడం లేదు.