కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తనదైన టీమ్‌తో ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. తన మార్క్ ఉండేలా… పార్టీలోని ఉత్యున్నత పదవుల్ని భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. కొన్నాళ్ల క్రితం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించిన ఆయన.. అందులో ఒక్కరంటే.. ఒక్క తెలుగు నేతకూ అవకాశం ఇవ్వలేదు. తాజాగా ఏర్పాటు చేసిన మూడు కీలక కమిటీల్లోనూ అదే పరిస్థితి పునరావృతమయింది. కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన ఎన్నికలు ముందుగా ఉన్న సమయంలో తెలుగు నేతల్ని రాహుల్ పట్టించుకోకపోవడం కలకలం రేపుతోంది.
సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. 2019 ఎన్నికలకు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కీలక కమిటీలను కాంగ్రెస్ పార్టీ శనివారం ఏర్పాటు చేసింది. కోర్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, పబ్లిసిటీ కమిటీలను నియమించింది. తనకు ఎంతో నమ్మకస్తులైన రణదీప్ నూర్జేవాలా, కేసీ వేణుగోపాల్‌లకు కోర్ కమిటీలో రాహుల్ స్థానం కల్పించారు . తొమ్మిది మంది సభ్యుల కోర్ కమిటీలో సోనియా గాంధీ విశ్వాసపాత్రులు అశోక్ గెహ్లట్, ఏకే ఆంటోనీ, గులామ్ నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, జైరామ్ రమేశ్, చిదంబరం ఉన్నారు. 19 మందితో మేనిఫెస్టో కమిటీ, 13 మంది సభ్యులతో పబ్లిసిటీ కమిటీలను ఏర్పాటు చేశారు. జైరామ్ రమేశ్, చిదంబరం.. కోర్ కమిటీ, మేనిఫెస్టో కమిటీల్లోనూ ఉన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు మేనిఫెస్టో తయారు చేయడానికి, పబ్లిసిటీ ప్రణాళిక రూపొందించే పనిలో కమిటీలు నిమగ్నమవుతాయి.
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్లుగా చెప్పుకునే నేతలతో పాటు… హైకమాండ్‌తో దగ్గరి సంబంధాలున్న.. జైపాల్ రెడ్డి, మధుయాష్కీగౌడ్ లాంటి వాళ్లకు కూడా.. కమిటీలో చోటు దక్కకపోవడం ఆశ్చర్యకరగా మారింది. పార్టీ అంతర్గత నిర్ణయాలను అన్నీ అంచనా వేసి.. పార్టీ అభిప్రాయం మేరకే తీసుకుంటారని..ఈ విషయంలో… ఇతరుల జోక్యం ఎందుకని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కానీ తెలుగువాళ్లను పూర్తిగా పట్టించుకోవడం మానేసిన రాహుల్ తీరుపై మాత్రం ఇప్పుడల్లా విమర్శలు తగ్గే అవకాశాలు లేవు.