తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మచిలీపట్నం పోర్టు పనులు నవయుగ కంపెనీ చురుకుగా చేపట్టింది. పదిశాతం పనులు పూర్తయ్యాయి. వైసీపీ సర్కార్ వచ్చింది. నవయుగ కంపెనీని గెంటేసింది ఇప్పుడు కొత్తగా పోర్టును రివర్స్ టెండర్లో ఎవరికైనా ఇద్దామని ప్రయత్నిస్తోంది. కానీ ఒక్కరంటే ఒక్క కాంట్రాక్టర్ కూడా కనీసం టెండర్ కూడా వేయడం లేదు. ఇప్పటికి మూడు సార్లు టెండర్లు పిలిచారు. ప్రతీ సారి నిబంధనలు మారుస్తున్నారు. కానీ ఎవరూ ముందుకు రావడం లేదు. తాజాగా ముగిసిన టెండర్ సమయానికికూడా ఒక్కరూ ముందుకు రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మరోసారి నిబంధనలు సరళీకరించి పిలవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
బందరు పోర్టు కోసం.. అక్కడి ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. వివిధ రకాల సమస్యలో ముందుకు సాగలేదు. టీడీపీ హయాం నవయుగ సంస్థ లీడ్ ప్రమోటర్‌గా మచిలీపట్నం పోర్టు లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. నిజానికి పోర్టు పనులు ప్రారంభమయ్యాయి. నవయుగ సంస్థ ప్రాజెక్టు స్థలం వద్దకు భారీ యంత్రాలను తరలించి… పనులను కూడా ప్రారంభించింది. పోర్టు ప్రాజెక్టుకు సంబంధించిన పలు పనుల కోసం ఇప్పటికే రూ.436కోట్లు వ్యయం చేసింది.కానీ హఠాత్తుగా ప్రభుత్వం పోర్టు ఒప్పందాన్ని రద్దు చేసింది.
అయితే టెండర్లు రాకపోవడం ఏమీ ఉండదని… రాకుండా చేయడమే ఉంటుందన్న అనుమానాలు ఆయా వ్యవహారాల నిపుణుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ తీరుపై నమ్మకం లేకపోవడం… ఇతరులు టెండర్లు వేయడం ఏపీ ప్రభుత్వానికి ఇష్టం ఉండదని సంకేతాలు వెళ్లడం.. ఎవరెవరు టెండర్లు వేయాలో వచ్చే సంకేతాలను బట్టే వారు టెండర్లేసే సంప్రదాయం ఉందన్న అనుమానాల నేపధ్యంలో ఈ వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. ఎవరూ ముందుకు రాని కారణంగా ప్రైవేటు సంస్థ అదానీకి మచిలీపట్నం పోర్టును నిర్మించుకుని నిర్వహించుకునే అవకాశం కల్పించే చాన్సులు ఉన్నాయన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఒక వేళ అదే జరిగితే టెండర్లు రాకపోవడాన్ని అనుమానించాల్సిన పని లేదు.