కాపులకూ చంద్రబాబు సర్కారుకు మధ్య రిజర్వేషన్ల అంశం నానుతున్న సంగతి తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు టీడీపీ సర్కారు ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. సాంకేతికంగా సవాలక్ష కారణాలు చెప్పినా, వాస్తవంలో జాప్యం జరుగుతూనే ఉంది. ఈ ఆలస్యం కారణంగానే కాపుల ఉద్యమాన్ని తెరమీదికి తెచ్చారు ముద్రగడ పద్మనాభం. అయితే, ముద్రగడ ఉద్యమించిన ప్రతీసారీ ప్రభుత్వం అడ్డుకోవడం, హామీని నెరవేర్చకపోవడం.. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి. ఈ రెండు ఎన్నికల్లోనూ ఆ సామాజిక వర్గం అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తుందేమో అనే అనుమానాలు కొంతమంది టీడీపీ నేతల్లో వ్యక్తమయ్యాయి. ఆ సామాజిక వర్గం సమస్యలను తెలుసుకునే పేరుతో చంద్రబాబు బుజ్జగింపు సభలు పెట్టినా, అవి ఏ మేరకు ఫలితాలను ఇస్తాయనే టెన్షన్ కొనసాగుతూ వచ్చింది. అయితే, జరిగిన రెండు ఎన్నికల్లోనూ తెలుగుదేశం విజయం సాధించింది. కాకినాడ కార్పొరేషన్ ఫలితాలే ఆ సామాజిక వర్గపరంగా కీలకమైనవిగా చెప్పొచ్చు.
కాకినాడలో ఆ సామాజిక వర్గం ప్రజల సంఖ్యే ఎక్కువ. ముద్రగడ పద్మనాభం ఉద్యమం నడుపుతున్నది కూడా ఆ జిల్లా నుంచే. దీంతో కాకినాడ కార్పొరేషన్ ఎన్నిక ఫలితాలపై ఎంతోకొంత ప్రభావం ఉంటుందని అనుకున్నారు. కానీ, కాకినాడ కార్పొరేషన్ ను తెలుగుదేశం గెలుచుకుంది. సాంకేతికంగా చూసుకుంటే ఇది కాపుల విజయమే. ఎందుకంటే, ఈ ఎన్నికలు తెరమీదికి రాగానే మేయర్ పదవి కాపులకే అని టీడీపీ ప్రకటించింది. అంతేకాదు, ఆ సామాజిక వర్గానికి చెందినవారికే అత్యధిక స్థానాలు కేటాయించింది. నిజానికి, ప్రతిపక్షం వైకాపా కూడా ఇదే వ్యూహం అనుసరించింది. అంతేకాదు, ముద్రగడ ఉద్యమానికి సంఘీభావం కూడా తెలిపింది. కానీ, చివరికి గెలుపు తెలుగుదేశం పార్టీదే అయింది. దీంతో ఆ పార్టీ వర్గాలు చెబుతున్నది ఏంటంటే… కాపులు కూడా తమవెంటే ఉన్నారనీ, ముద్రగడ ఉద్యమం ప్రభావం పెద్దగా లేదనేది!
వాస్తవంగా ఆలోచిస్తే.. ఆ సామాజిక వర్గం టీడీపీ వెంట ప్రస్తుతం ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఉంటారనేది ఇప్పుడే నిర్ణయించలేని విషయం. ఎందుకంటే, రిజర్వేషన్ల అంశమై త్వరలోనే ఒక నిర్ణయం ఉంటుందనీ, కాపుల సమస్యలన్నింటికీ పరిష్కారాలు కల్పిస్తున్నామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. త్వరలోనే మంజునాథ కమిషన్ నివేదిక వచ్చేస్తుందనీ, రిజర్వేషన్లు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. అనుకున్నట్టుగా ఈ హామీ నెరవేర్చ గలిగితేనే వచ్చే ఎన్నికల్లో కూడా కాపుల టీడీపీ వెంటే ఉంటారనే అంచనా వేసుకోవచ్చు. అంతేగానీ, ఒక్క కాకినాడ కార్పొరేషన్ ఫలితాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ధీమా పడితే ఇబ్బందులు తప్పవు. గత నెలలో విజయవాడలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంతోపాటు, కాకినాడ ప్రచారంలో భాగంగా ఆయన ఇచ్చిన హామీలను ఆ సామాజిక వర్గం నమ్మింది. దాన్ని అలానే కాపాడుకోవాలంటే రిజర్వేషన్ల అంశంపై సానుకూల నిర్ణయం జరగాల్సి ఉంటుంది.