రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలైతే ఆ మజా ఎలా ఉంటుందో చూసేశారు తెలుగు సినీ ప్రేక్షకులు. రెండు సినిమాలకూ బ్రహ్మరథం పట్టారు. సినిమాల్ని గెలిపించారు… ప్రేక్షకులుగా తాము గెలిచారు. అంతా బాగానే ఉంది. కానీ.. ఈ రెండు సినిమాలకూ కొన్ని కొన్ని విషయాల్లో ద్రోహం జరిగిందన్నది తెలుగు సినీ జనాల మాట. అందుకే వినాయక్ నిన్నటి ప్రెస్ మీట్లో `మా సినిమాకి అన్యాయం జరిగిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు` అంటూ ఓ హింట్ ఇచ్చాడు. ఇటు వైపు బాలయ్య సినిమాకీ ద్రోహం జరిగింది. అయితే ఇక్కడ కాదు దుబాయ్లో. తెలుగు సినిమాలకు దుబాయ్లో పిచ్చ క్రేజ్. ఎందుకంటే అక్కడ తెలుగు సంతతి ఎక్కువ. ఇక్కడి కోస్తాంధ్ర నుంచి ఉపాధి కోసం వెళ్తినవాళ్ల సంఖ్య దుబాయ్లో బలంగా ఉంది. స్టార్ హీరోల సినిమాలకు అక్కడ కళ్లు చెదిరేలా వసూళ్లు దక్కుతాయి. చిరు సినిమాకీ అక్కడ భారీగా వసూళ్లు వస్తున్నాయి. ఎటొచ్చి అన్యాయమైపోయింది బాలయ్య సినిమానే.
గౌతమిపుత్ర శాతకర్ణి దుబాయ్లో విడుదల కాలేదు. దానికి కారణం… దుబాయ్లో థియేటర్లు దొరకలేదు. ముందస్తుగా అక్కడున్న థియేటర్లన్నీ ఖైదీ నెం.150 కోసం బుక్ చేసేశారు. ఒక్కటంటే ఒక్క థియేటర్ కూడా గౌతమి పుత్రకి దక్కలేదు. వారం రోజుల పాటు అన్ని థియేటర్లన్నీ ఖైదీ సినిమా కోసం బ్లాక్ చేశారు. ఇప్పుడు ఖైదీ ప్రభావం మెల్లమెల్లగా తగ్గిపోయింది. అక్కడి థియేటర్లూ ఖాళీ అవుతున్నాయి. అందుకే దుబాయ్ తెలుగు అసోసియేష్ ‘గౌతమి పుత్రని ప్రపంచమంతా చూస్తోంది. ఒక్క దుబాయ్లో తప్ప. ఇక్కడ కూడా గౌతమి పుత్ర విడుదల చేయండి ప్లీజ్’ అంటూ గౌతమిపుత్ర దర్శక నిర్మాతల్ని ప్రత్యేకంగా అభ్యర్థిస్తుండడం విశేషం. వచ్చే వారంలో ఈ చిత్రాన్ని దుబాయ్లో విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. కాకపోతే దుబాయ్లో పైరసీ ప్రభావం ఎక్కువ. విడుదలైన రెండో రోజే తెలుగు సినిమా మంచి క్వాలిటీతో దొరికిపోతుంది. ఈ ఎఫెక్ట్ గౌతమిపుత్రపై పడే అవకాశం పుష్కలంగా ఉంది. అదే ఖైదీతో పాటు గౌతమి కూడా విడుదలైతే.. ఖైదీ వసూళ్లపై గౌతమి కచ్చితంగా ప్రభావం చూపించేదని అక్కడి డిస్టిబ్యూటర్లు లెక్కలు వేస్తున్నారు.