ఈ సంక్రాంతికి ఇద్దరు టాప్ హీరోల సినిమాలతో పోటీ పడ్డాడు నారాయణ మూర్తి. ఆయన నటించిన ‘హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య’ ఈ నెల14న విడుదలైంది. సినిమాని పోటీ పడి విడుదల చేశారు గానీ… థియేటర్లు పెద్దగా దొరకలేదు. మూర్తిగారేం చేశారో చూద్దామని ఆశ పడిన వాళ్లందరికీ థియేటర్లో సినిమా లేకపోవడంతో నిరాశే ఎదురైంది. నైజాంలో 23 థియేటర్లు దొరికితే.. ఆంధ్ర ప్రదేశ్‌లో పట్టుమని నాలుగు థియేటర్లు కూడా దొరకలేదని చిత్ర బృందం వాపోతోంది.
”నేను ముప్పై ఏళ్లుగా సినిమాలు తీస్తూ వస్తున్నాను. పదిహేనేళ్లుగా అనేక గాయాలతో ఈ సినిమా సాగరాన్ని ఎదురీదుతూ వస్తున్నాను. హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య విషయానికి వస్తే, సాధారణంగా నా సినిమా అంటే మినిమమ్ బడ్జెట్లో చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేలా ఉంటాయి. అయితే చదలవాడ శ్రీనివాసరావుగారు బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశారు. నిజాయితీ గల వ్యక్తిని ఆర్ధిక బంధాలు ఎలా డామినేట్ చేశాయి. అయినా ఆ వ్యక్తి ఎలా ఎదిరించి నిలిచాడనే పాయింట్‌తో ఈ సినిమాను చదలవాడశ శ్రీనివాసరావుగారు చక్కగా తెరకెక్కించారు. ఆంధ్రకు వెళ్లినప్పుడు రాజమండ్రిలో కొందరు మిత్రులు నన్ను కలిసి సినిమా టాక్ బావుందన్నా కానీ థియేటర్స్‌లో సినిమా లేని కారణంగా సినిమా చూడలేదని అనడం నన్నెంతో బాధకు గురి చేసింది. హెడ్ కానిస్టేబుల్ సినిమా ప్రారంభం రోజునే నిర్మాతగారు సంక్రాంతికి సినిమాను విడుదల చేస్తానని అన్నారు. అలా ఆయన అనడం ఆయన తప్పా.. చిన్న సినిమాలకు థియేటర్స్ విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఓ నిర్ణయం తీసుకుంటేనే చిన్న సినిమాలు బ్రతుకుతాయి. సంక్రాంతి బరిలోకి వచ్చిన కొన్ని సినిమాలకే థియేటర్స్‌ను కేటాయించకుండా, అన్నీ సినిమాలకు న్యాయం జరిగేలా చూడాలి” అన్నారాయన.
థియేటర్లు లేకపోయినా అనుకొన్న సమయానికి చెప్పిన టైమ్‌కి సినిమాని రిలీజ్ చేయడమే తమకు లభించిన అతి పెద్ద జయమని దర్శకుడు చదలవాడ చెబుతున్నారు. సంక్రాంతి పోటీలో ఉండాలనుకోవడం తప్పు లేదు. కానీ… పెద్ద సినిమాల ఉధృతిలో కొట్టుకుపోకుండా కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. నారాయణమూర్తి సినిమా ఒక్క వారం ఆగి వచ్చినా… కావల్సినన్ని థియేటర్లు దొరికేవి. పోటాపోటీగా తన సినిమాని విడుదల చేయడంతో.. థియేటర్ల సమస్య ఉత్పన్నమైంది. ఈ వారం సినిమాలేం లేవు. కాబట్టి హెడ్ కానిస్టేబుల్‌కి కొత్తగా కొన్ని థియేటర్లు దొరికే అవకాశం ఉంది. అయితే అప్పటికే ఈసినిమా టాక్ అందరికీ తెలిసిపోయి.. చూడాలన్న ఇంట్రస్ట్ కూడా తగ్గిపోవొచ్చు. పైగా సంక్రాంతి సీజన్ కూడా అయిపోయింది. ఈ దశలో ఎన్ని థియేటర్లు దొరికినా లాభం లేదు.