ఈమధ్య చిత్రసీమ దృష్టిని ఆకర్షించిన పేరు… ‘కే జీ ఎఫ్’. కన్నడ చిత్రసీమలోనే భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రమిది. విజువల్స్ కూడా బాగుండడంతో కే జీ ఎఫ్ గురించి దేశమంతా మాట్లాడుకుంది. పాన్ ఇండియా ట్యాగ్‌తో వస్తున్న ఈ చిత్రం ఈనెల 21న విడుదల అవుతోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి రాజమౌళి రావడం, ఈ సినిమాని మెచ్చుకోవడంతో టాలీవుడ్ కూడా ఈ సినిమాపై దృష్టి నిలిపింది. అయితే… ఇప్పుడు ఈ సినిమాకి కావల్సిన సంఖ్యలో థియేటర్లు దొరకడం లేదు. ఇదే రోజున శర్వానంద్ ‘పడి పడి లేచె మనసు’, వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ చిత్రాలు విడుదల అవుతున్నాయి. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్, దిల్‌రాజు ఈ రెండు చిత్రాల్ని ఆంధ్ర, తెలంగాణలలో విడుదల చేస్తున్నారు. మొత్తం థియేటర్లన్నీ వీళ్ల చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి.. ‘పడి పడి లేచె మనసు’, ‘అంతరిక్షం’ చిత్రాల థియేటర్లకు కొదవలేదు. కానీ ‘కే జీ ఎఫ్’ కి కావల్సిన థియేటర్లు దొరకలేదు. దాంతో… కేజీఎఫ్ చిత్రబృందం నిరాశకు లోనైంది. అయితే కేజీ ఎఫ్ దృష్టి తెలుగు పరిశ్రమపై పెద్దగా లేదేమో అనిపిస్తోంది. పబ్లిసిటీ పరంగానూ స్పీడప్ లేదు. మరోవైపు అంతరిక్షం, పడి పడి లేచె మనసు చిత్రబృందాలు పబ్లిసిటీతో హోరెత్తిస్తున్నాయి. కేజీఎఫ్ మాత్రం చాలా కూల్‌గా ఉంది. తక్కువ థియేటర్లలో విడుదలైనా.. టాక్ ని బట్టి థియేటర్లు పెరుగుతాయని కేజీఎఫ్ బృందం ఆశిస్తోంది.