సాయిధరమ్ తేజ్ తాజా సినిమా తిక్కకు కొత్త తలనొప్పి ఎదురైంది. ఈ సినిమాకి కావల్సిన సంఖ్యలో థియేటర్లు దొరకలేదు. ఓవైపు బాబు బంగారం శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. మరోవైపు గతవారం విడుదలైన శ్రీరస్తు శుభమస్తు, మనమంతా సినిమాలు ఆడుతున్నాయి. సురేష్ బాబు చేతిలో ఉన్న చాలా థియేటర్లలో ఇంకా పెళ్లిచూపులు బొమ్మే నడుస్తోంది. ఈ నేథప్యంలో తిక్క టెన్షన్లో పడింది. అయితే ఎక్కువ థియేటర్లలో శ్రీరస్తు శుభమస్తు నడుస్తోంది. గీతా ఆర్ట్స్ చేతిలో ఉన్న థియేటర్లలో సగం వదిలినా తిక్కకు ప్రాబ్లం క్లియర్ అవుతుంది. కానీ… అల్లు అరవింద్ మాత్రం థియేటర్లు ఇవ్వడం లేదట. ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమానే ఆడించాలి…. అంటున్నార్ట. దాంతో తిక్క ప్రొడ్యూసర్ తలపట్టుకొన్నాడు.
ఓ మెగా హీరో సినిమాకి మరో మెగా హీరో సినిమానే అడ్డుపడుతోందిప్పుడు. బయటి నిర్మాతలు కాబట్టి.. హీరో ఇంటి వాడైనా.. అల్లు అరవింద్ కనికరం చూపించడం లేదట. పైగా.. శ్రీరస్తు శుభమస్తుకు యావరేజ్ టాక్ వచ్చింది. తన కొడుకు సినిమాని నిలబెట్టుకోవాలంటే.. థియేటర్లని వదులుకోకూడదు. ఇదే ఇప్పుడు తిక్క సినిమాకి పెద్ద సమస్యగా మారింది. సుప్రీమ్తో సాయిధరమ్ ఇమేజ్ మాస్ లో మరింత పెరిగింది. దాన్ని క్యాష్ చేసుకోవాంటే బీ,సీ సెంటర్లలో తిక్క సినిమాని భారీగా విడుదల చేసుకోవాలి. అయితే… అల్లు అరవింద్ మాత్రం థియేటర్లు తన చేతుల్లో పెట్టుకొన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.