మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటే.. అందరూ… ప్రభుత్వంపై పదే పదే పిటిషన్లు వేసి చికాకు పెట్టిన నేతే అందరికీ గుర్తు వస్తాయి. జగన్ అయినా ప్రభుత్వంపై పోరాడారో లేదో కానీ.. మంగళగిరి ఆర్కే మాత్రం.. ప్రభుత్వంపై పోరాటానికి .. ఐదేళ్లూ కోర్టుల చుట్టూ తిరిగారు. ఆయన వేసిన పిటిషన్లతో.. కోర్టులు ఫార్మాలిటీగా నోటీసులు జారీ చేస్తేనే… సాక్షి పత్రిక పేజీలు , పేజీలు ప్రచురించింది. కానీ ఇప్పుడా ఆర్కేకు .. వైసీపీలో కష్టకాలం వచ్చింది. పట్టించుకునే పరిస్థితి లేకపోవడం.. టిక్కెట్ లేదని తేల్చి చెప్పడం.. ఆయన వ్యతిరేకుల్ని… పిలిచి మరీ జగన్ మర్యాదలు చేస్తూండటంతో.. ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వంపై చీటికి, మాటికీ కోర్టుకెక్కే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఆ పార్టీలో ప్రత్యర్ధి వర్గం ఎర్త్ పెట్టింది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి తెలియకుండానే తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరువురు కౌన్సిలర్లతో పాటు మరో బిజెపి కౌన్సిలర్ హైదరాబాద్ లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో వైసిపిలో చేరిపోయారు. ఈ పరిణామంతో ఆర్కే వర్గం బిత్తరపోయింది. ఈ పరిణామంతో ఖంగుతిన్న రామకృష్ణారెడ్డి పై ఆయన అనుచరవర్గం పార్టీలో మన స్థానం ఏమిటో తేల్చుకోవాలని ఒత్తిడి ప్రారంభించింది. దీంతో రామకృష్ణారెడ్డి ఎవరికీ అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఆళ్ల కుటుంబం సన్నిహితంగా వ్యవహరించింది. రాంకీ గ్రూప్ వ్యాపారం వీరికి ఉంది. ఆళ్ల అయోధ్యరామిరెడ్డి గత ఎన్నికల్లో నరసరావు పేట పార్లమెంట్ స్థానం నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. ఆళ్ల అయోధ్యరామిరెడ్డి భారీ తేడాతో ఓడిపోగా… రామకృష్ణారెడ్డి మాత్రం మంగళగిరిలో 17 ఓట్ల తేడాతో గట్టెక్కి ఎమ్మెల్యే అయ్యారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు పలు మార్లు కోర్టుకు కూడా వెళ్లారు. రాజన్న క్యాంటీన్ , రాజన్న రైతు బజార్ పేరిట మంగళగిరిలో సేవా కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. కానీ ఇప్పుడు జగన్ పీకే సలహాతో… అక్కడ బీసీ అభ్యర్థిని రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నారు. గృహప్రవేశం సమయంలో ఆళ్లను పిలిపించుకున్న జగన్.. గెలిచే చాన్స్ లేదని సర్వేల్లో తేలిందని… టిక్కెట్ ఇవ్వడం లేదని మొహం మీదే చెప్పేశారట. పార్టీ కోసం అంత చేసిన ఆళ్లనే పక్కన పెడితే.. ఇక జగన్ పై ఎవరు విశ్వాసంగా ఉంటారని… వైసీపీ నేతలు మథనపడుతున్నారు.