సాలూరు ఎమ్మెల్యే, డిప్యూటీ సిఎం రాజన్నదొరకు జగన్ రెడ్డి షాకిచ్చారు. ఆయన నియోజకవర్గంలో గిరిజిన వర్శిటీకి శంకుస్థాపన చేసి.. ఆయన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపన సభలో డిప్యూటీ సీఎం గురించి కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క వరం కూడా ప్రకటించలేదు. సిఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన సమయంలో డిప్యూటీ సిఎం రాజన్నదొర పక్కనే నిలబడ్డారు
.
జగన్ 35 నిమిషాల ప్రసంగంలో దొర గురించి ప్రస్తావించకపోవడం సరికొత్త చర్చకు తెరలేపింది. మరో ఆరు నెలల్లో ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో సిఎం జగన్ డిప్యూటీ సిఎంగా రాజన్నదొర పనితీరు గురించి పల్లెత్తు మాట అనలేదు. 2024లో జరిగే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా మళ్లీ రాజన్నదొరని ఆశీర్వదించాలని చెప్పకపోవడంతో ఆయనకు టిక్కెట్ లేదని చెబుతున్నారు.
ఇటీవల కాలంలో కురుపాం నియోజకవర్గంలో సిఎం జగన్ పర్యటించారు. అక్కడ నిర్వహించిన సభలో సిఎం జగన్ మాజీ మంత్రి పుష్పశ్రీవాణి గురించి ప్రస్తావించారు. రానున్న ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పుష్పశ్రీవాణిని మళ్లీ గెలిపించాలని జగన్ కోరారు. కానీ సాలూరు నియోజకవర్గ పరిధిలో జరిగిన గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపన సభలో మాత్రం రాజన్నదొర ఊసెత్తని పరిస్థితి కనిపించింది. దీంతో ఆయనకు టిక్కెట్ లేదని దాదాపు ఖరారైందని అంటున్నారు.
వైసిపి అధిష్టానం సొంతంగా కొన్ని , ఇతర సంస్థలతో రానున్న ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై రహస్యంగా సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వేల్లో డిప్యూటీ సిఎం రాజన్నదొరకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయనే వాదనలు గుప్పుమన్నాయి. నియోజకవర్గ పార్టీపై నియంత్రణ లేకపోవడం, పూర్తిగా ఉమ్మడి జిల్లా అగ్రనేత కనుసన్నల్లో పని చేస్తుండడం వంటి అంశాలు పార్టీ అంతర్గత సర్వేల్లో ప్రతికూలతకు కారణాలనే చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది.