తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత.. మొదటి లిస్ట్ ప్రకటించిన దాదాపు 70 రోజుల తర్వాత చివరి రెండు టిక్కెట్లు ప్రకటించారు. ముషీరాబాద్ నుంచి.. గత ఎన్నికల్లో పోటీ చేసిన ముఠా గోపాల్‌కే టిక్కెట్ ఖరారు చేశారు. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని… ఉవ్విళ్లూరిన.. నాయిని నర్సింహారెడ్డికి షాక్ ఇచ్చారు. అయినా తన అల్లుడు, కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డికి లేకపోతే.. తనకు ఇవ్వాలని… నాయిని పట్టుబట్టారు. ముషీరాబాద్‌తో తనకు నలభై ఏళ్ల అనుబంధమని వాదించారు. కానీ… కేసీఆర్ నాయినికి కానీ.. ఆయన కుటుంబానికి కానీ ఇవ్వాలనుకోలేదు. అందుకే ఎప్పటికప్పుడు సీటు పెండింగ్‌లో పెట్టారు. మధ్యలో నాయిని నర్సింహారెడ్డి అల్లుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది. వీటన్నింటినీ తట్టుకుని నాయిని.. కేసీఆర్‌పై నమ్మకం పెట్టుకున్నారు. చివరికి నాయినిని బుజ్జగించి.. ముఠా గోపాల్‌కే టిక్కెట్ ఖరారు చేశారు కేసీఆర్.
ఇక కోదాడ టిక్కెట్ విషయంలోనూ.. కేసీఆర్ చివరి వరకు నాన్చారు. అక్కడ టీఆర్ఎస్ టిక్కెట్ కోసం.. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, గత ఎన్నికల్లో పోటీ చేసిన శశిధర్ రెడ్డి టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. కానీ వారి కంటే బలమైన అభ్యర్థి దొరుకుతారేమోనని.. కేసీఆర్ ఎదురు చూశారు. ఓ దశలో చందర్ రావు టిక్కెట్ ఖరారయిందన్న ప్రచారం కూడా జరిగింది. కోదాడ సీటు కూటమి సీట్ల సీట్ల పంపకాల్లో భాగంగా.. టీడీపీకి వెళ్తుందని.. అక్కడ గత ఎన్నికల్లో పోటీ చేసి.. గట్టి పోటీ ఇచ్చిన బొల్లం మల్లయ్య యాదవ్ కు టిక్కెట్ ఇస్తారని అనుకున్నారు. కానీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణికి టిక్కెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో… కోదాడ కాంగ్రెస్ ఖాతాలోనే పడిపోయింది. దీంతో మల్లయ్య యాదవ్‌ను.. టీఆర్ఎస్ వెంటనే పార్టీలో చేరుకుంది. ఒక్క రోజు వ్యవధిలో టిక్కెట్ ఖరారు చేసింది.
తెలంగాణలో… మొత్తం 119 స్థానాల్లోనూ.. టీఆర్ఎస్ పోటీ చేస్తోంది. మొదటగా 105 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన కేసీఆర్ ఆ తర్వాత మూడు సార్లు.. మిగతా పధ్నాలుగు సీట్లను ఖరారు చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఓసీలు – 58 ఎస్సీ – 19 ఎస్టీ 12 సిక్కు – 1 బీసీ – 26 ముస్లిం – 3 స్థానాల్లో అవకాశాలు ఇచ్చారు. మహిళలు మాత్రం 119 మందిలో నలుగురు మాత్రమే ఉన్నారు.