విశాఖపట్నం: స్థానిక రుషికొండ బీచ్ లో ప్రవేశానికి రూ. ఇరవై ఫీజు వసూలు చేయాలని నిర్ణయించడంపై … ఫీడ్ బ్యాక్ మరీ ఘోరంగా రావడంతో ప్రభుత్వం ఉలిక్కి పడింది. అలాంటిదేమీ లేదని.. కొత్తగా మంత్రి అమర్నాథ్ మీడియా ముందుకు వచ్చారు. నిజానికి పదకొండో తేదీ నుంచి టిక్కెట్ పెట్టడానికి అంతా రెడీ అయిపోయింది. అమల్లోకి వచ్చే వరకూ ఎవరికీ తెలియకుండా చేద్దామనుకున్నారు. కానీ రెండు రోజుల ముందే తెలిసిపోయింది. దీంతో ప్రభుత్వం కంగారు డక తప్పలేదు.
రుషికొండ బీచ్‌కు బ్లూ స్టార్ హోదా లభించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం, ఆ బీచ్ లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రుసుము వసూలు చేయాలని పేర్కొందని మంత్రి చెప్పుకొచ్చారు. దీనిని ఆధారంగా చేసుకుని బీచ్ లో రుసుము వసూలు చేయడానికి రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో మంత్రి అమర్నాథ్ స్పందించి బీచ్ లో ప్రవేశానికి ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదని, బీచ్ లో సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని, రుసుము వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దని అమర్నాథ్ స్పష్టం చేశారు.
నిజానికి సదుపాయాలు కల్పించాలని కేంద్రం చెప్పింది కానీ చార్జీలు వసూలు చేయమని కాదు. కానీ సదుపాయాలు కల్పించడం అదనపు ఖర్చు అని.. ఆ భారాన్ని పర్యాటకుల మీదే తోసేద్దామని ప్లాన్ చేశారు . ఇప్పుడు రచ్చ జరిగింది కాబట్టి తీసేస్తున్నట్లుగా ప్రకటించినా… ఎప్పుడో ఓ సారి ఎవరికీ తెలియకుండా టిక్కెట్లు పెట్టేస్తారని అంటున్నారు. ఇప్పటికే పార్కింగ్.. ఇతర ఫీజులు భారీగానే వసూలు చేస్తున్నారు.