రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో కౌంటర్ దాఖలు చేయడానికి వారాలకు వారాల గడువు సీబీఐకి సరిపోవడం లేదు. ఒక్క సీబీఐకే కాదు…. నిందితుడైన జగన్మోహన్ రెడ్డికీ తీరడంలేదు. గత రెండు వాయిదాలుగా… కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరుతూనే ఉన్నారు. దీంతో చివరి అవకాశం ఇచ్చి.. సీబీఐ కోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ నెల ఇరవై ఆరో తేదీకి ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటర్ దాఖలు చేయాలని అటు జగన్కు.. ఇటు సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఓ వైపు పిటిషనర్ అయిన రఘురామకృష్ణరాజు.. తనను అక్రమ కేసులో ఇరికించారని.. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ను ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని.. ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి సమయంలో.. బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు రావడంతో.. ఏం జరుగుతుందోనన్న ఆసక్తి కలిగింది. అదేసమయంలో గత వాయిదాలో సీబీఐ కౌంటర్ దాఖలు చేసే సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నరేంద్రమోడీని జార్ఖండ్ సీఎం విమర్శించడంపై ఆయనను విమర్శిస్తూ… మోడీని పొగుడుతూ ట్వీట్ చేశారు. అప్పుడు సీబీఐ కౌంటర్ దాఖలు చేయలేదు. దాంతో.. దీని కోసమే జగన్ మోడీని పొగిడారంటూ… సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి.
కౌంటర్ దాఖలు చేయాడానికి సీబీఐ ఎందుకు పదే పదే గడువు అడుగుతోందో.. న్యాయనిపుణులకు అర్థం కావడం లేదు. దాఖలు చేయాలనుకుంటే… గంటల్లోనే.. కౌంటర్ రెడీ చేయగల కెపాసిటీ సీబీఐకి ఉంది. దానికితగ్గ యంత్రాంగమూ ఉంది. కానీ… అటు జగన్తో పాటు ఇటు సీబీఐ కూడా.. ఒకే సారి.. కౌంటర్ దాఖలు చేయాలనుకుంటున్నట్లుగా పదే పదే వాయిదాలు కోరడం.. చాలా మందిలో కొత్త సందేహం రేపుతోంది. సీబీఐ దాఖలు చేసే కౌంటర్… కీలకం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.