ఐ ఫోన్ మీద ఎంతో కొంత మోజు వుండని మొబైల్ ఫోన్ వాడకం దారులు ఎక్కడో గాని వుండరు. ఐటి, కమ్యూనికేషన్ రంగాల్లో ఆపిల్ బ్రాండ్ కు అంతటి ప్రీమియమ్ విలువ వుంది. అంతటి సంస్ధ వ్యాపార అవకాశాలకోసం వస్తే ” ప్రపంచం వాడివదిలేసిన e గార్భేజీకి డంప్ యార్డు కాలేమని” భారత దేశం తెగేసి చెప్పింది.
దేశప్రయోజనాలను నెరవేర్చనపుడు ఆపిల్ వ్యాపారాన్నైనా సరే అనుమతించవలసిన పనిలేదని భారతీయ నెటిజన్లు ప్రధానమంత్రి కార్యాలయానికి, వాణిజ్యమంత్రిత్వ శాఖకు, ఆర్ధిక మంత్రిత్వ శాఖకు విజ్ఞతాయుతమైన సలహాలు పిటీషన్లు పంపారు. ఆమేరకు ట్విట్టర్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టారు.
భారత్‌లో యాపిల్ స్టోర్లు పెట్టడం… సెకండ్ హ్యాండ్ ఐఫోన్లను అమ్మడం… ఈ రెండు ప్రతిపాదనలతోనే ఆపిల్ సిఇఒ టిమ్ కుక్ భారత్ వచ్చారు. పాత ఫోన్లు అమ్మడం ద్వారా తక్కువ ధరకే ప్రజలను యాపిల్ వినియోగదారులుగా మార్చుకోవచ్చన్నది టిమ్ కుక్ ఆలోచన. దీంతో పాటు తమ కంపెనీకి చెందిన హైదరాబాద్ మ్యాప్ డెవలప్మెంట్ సెంటర్లో 4 వేల ఉద్యోగాలు కల్పిస్తామని కూడా కుక్ చెప్పారు.
రిఫర్బిష్డ్ ఐఫోన్లు (వినియోగించిన లేదా సెకండ్‌హ్యాండ్ ఫోన్లు) తీసుకొచ్చి ఆపిల్ స్టోర్ల నెలకొల్పేందుకు ఆపిల్ పెట్టుకున్న దరఖాస్తును కేంద్రం తోసిపుచ్చింది. రిఫర్బిష్డ్ ఐఫోన్లను దిగుమతి చేసుకుని భారత్‌లో అమ్మేందుకు నిరాకరించింది. ఆ ప్రతిపాదనను అమలుచేసేందుకు భారత నిబంధనలు అనుమతించవని తేల్చిచెప్పింది. దీని ద్వారా దేశాన్ని ఈ-వ్యర్థాలు దేశాన్ని ముంచెత్తడంతో పాటు ఎలాంటి వాల్యూ క్రియేషన్ ఉండదని పేర్కొంది.
30 శాతం లోకల్ సోర్సింగ్ ఉండాలన్న నిబంధన నుంచి వెనక్కి తగ్గేది లేదని ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ నిబంధనల నుంచి మినహాయింపు నివ్వాల్సిందిగా ఆపిల్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిందనీ.. స్థానిక యువతకి ఉద్యోగాల కల్పన కోసం ఉద్దేశించిన ఈ నిబంధనను నుంచి వెనక్కితగ్గేది లేదనీ అన్నారు. ”ఈ నిబంధనకు హేతుబద్దత ఉంది. ఓ విదేశీ సప్లయర్‌కు అంత భారీగా మార్కెట్ చేసుకునేందుకు అవకాశమివ్వాలంటే… భారత్‌లో కనీసం కొన్ని ఉద్యోగాలైనా సృష్టించేట్టు ఉండాలి. లేకుంటే ఈ దేశం పూర్తిగా వర్తకులతోనే నిండిపోతుంది…” అని ఆయన పేర్కొన్నారు.
అయితే ఆపిల్ సంస్థకు పూర్తిగా తలుపులు మూసేయలేదనీ… నిబంధన పరిధిలో సరికొత్త ప్రతిపాదనలతో మళ్లీ వస్తే తప్పక ఫలితం ఉంటుందని కూడా జైట్లీ చెప్పారు.