తెలుగు చిత్రసీమ వరకూ ఓ ప్రయత్నం ‘అ’. సినిమా తలతిక్కగా ఉందని కొంతమంది వ్యాఖ్యానిస్తే.. ఆ తలతిక్కతనమే చాలామందికి నచ్చింది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌కి అంతా షాకయ్యారు. ఇలాంటి కొత్త ప్రయత్నాల్ని ఆహ్వానించాల్సిందే, ఆశీర్వదించాల్సిందే. దాంతో పాటు నిర్మాతగా నాని చేసిన ఈ ప్రయత్నాన్ని హర్షించాలి కూడా. వాయిస్ ఓవర్ ఇవ్వమని అడగడానికి వస్తే.. ”ఈ సినిమాని నేనే ప్రొడ్యూస్ చేస్తా” అంటూ వరం ఇచ్చేశాడు నాని. అందుకే ఈ సినిమా సక్సెస్‌లో సగ భాగం తనకే దక్కుతుంది.
అయితే నాని ప్రయత్నం గురించి గానీ, ఈ సినిమా గురించి గానీ… ఇండ్రస్ట్రీలో పెద్దలెవరూ నోరు మెదపడం లేదు. నానికి అత్యంత సన్నిహితులుగా చెప్పుకునే ఫ్రెండ్స్ గ్యాంగ్ ఒకటి ఉంది. వాళ్లు కూడా ఈ సినిమాపై పెద్దగా స్పందించలేదనే చెప్పాలి. చిన్న సినిమా బాగుంటే వెనకేసుకొచ్చే రాజమౌళి కూడా ‘అ’ విషయంలో పెద్దగా నోరు మెదపలేదు. ఆడియో ఫంక్షన్‌కి వచ్చి ఆశీర్వదించి వెళ్లాడంతే. ఇండ్రస్ట్రీలో మేధావి వర్గం.. చిన్న సినిమా విజయాల కోసం పరితపనిస్తున్న వ్యక్తులు ఇలాంటి సినిమాలొచ్చినప్పుడైనా కాస్త ముందు కొచ్చి స్వచ్ఛందంగా మాట్లాడితే… కొత్తగా ఆలోచించేవాళ్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ విషయంలో నానికి కాస్త అన్యాయమే జరిగింది.