తెలుగు చిత్రసీమే కాదు.. యావత్ భారత చలన చిత్ర రంగానికే గర్వ కారణం.. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. ఆయన మరణంతో అభిమానులు చలించిపోయారు. బాలు ఒక్కడే వెళ్లిపోలేదు. చాలా జ్ఞాపకాల్ని, తీపి గురుతుల్నీ తీసుకెళ్లిపోయాడు. `బాలు లాంటి వాళ్లకు మరణమేంటి` అని అనుకున్నా – ఆయన ఇప్పుడు గతం. బాలు మరణాన్ని చిత్రసీమ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. కానీ.. ఆయన్ని సరైన రీతిలో గౌరవించుకోవాల్సిన సందర్భంలోనూ – మీన మీషాలు లెక్కేయడం చూస్తుంటే `అసలు బాలు అంటే వీళ్లకు కనీసం గౌరవం ఉందా` అనిపిస్తోంది.
చిత్రసీమలో ఎవరైనా ఓ ప్రముఖుడు చనిపోతే సంతాప సభ పెట్టడం, నివాళి అర్పించడం పరిపాటి. కానీ… బాలు విషయంలో అది ఇంత వరకూ జరగలేదు. `కరోనా వచ్చిందండీ.. సోషల్ డిస్టెన్సీ ఉండాలండీ` అని కబుర్లు చెప్పడానికి ఇప్పుడు వీల్లేదు. ఎందుకంటే ఎంత కరోనా అయినా ప్రైవేటు కార్యక్రమాలు బోల్డన్ని జరుగుతున్నాయిప్పుడు. ఏకంగా షూటింగులే మొదలెట్టేశారు. ఇక నివాళిలు అర్పించుకోవడానికీ, సంతాపం చెప్పుకోవడానికి భయాలెందుకు..?
చిత్రసీమకు బాలు ఏం చేశారు? అనేది పక్కన పెట్టండి. అందరితోనూ ఆయనకు అనుబంధం ఉంది కదా..? ప్రతి ఒక్కరి విజయంలో బాలుకి వాటా ఉంది కదా..? సంగీత దర్శకులందరితోనూ ఆయన పని చేశారు కదా…? గీత రచయితలందరితోనూ అవినాభావ సంబంధం ఉంది కదా..? ఆయనకు తెలియని నిర్మాత లేడు. పాట పాడించుకోని సంగీత దర్శకుడు లేడు. వీళ్లెవ్వరికీ బాలుకి నివాళి చెప్పలేదే.. అన్న బాధే లేదు. బాలు చనిపోతే.. చూడ్డానికి వెళ్లిందెవరు? ఆయన ఆసుపత్రిలో ఉన్నా పలకరించిందెవరు? ఎవరూ లేరు. కనీసం `నా అన్న` అని చెప్పుకునే సీతారామశాస్త్రి సైతం – బాలు అంత్యక్రియల్లో కనిపించలేదు. బాలుతో ఎక్కువ పాటలు పాడించుకున్న చిరంజీవి సైతం వీడియో సందేశాలకు పరిమితమైపోవడం బాధాకరం. ఇప్పుడు చిత్రసీమ పెద్ద దిక్కు అనిపించుకుంటోంది ఆయనే కదా..? ఆయన పూనుకుంటే సంతాప సభ ఏర్పాటు చేయడం ఎంత సేపు..? నిర్మాతల మండలి, దర్శకుల సంఘం, `మా`…. ఇవన్నీ ఏమైపోయాయిప్పుడు? ఎవ్వరూ ముందుకు రారేంటి?`
మెహర్బానీల కోసమో, మెప్పు కోసమో చేసుకునే తంతు కాదిది. ఓ గొప్ప కళాకారుడిపై తమకున్న అభిమానాన్ని, ప్రేమనీ చూపించుకునే వేదిక. ఇలాంటి విషయాల్లో కూడా ఎవ్వరిలో చలనం లేకపోవడం చూస్తుంటే – బాలుపై చూపించిన ప్రేమంతా నిజమా, నటనా? అనే పిచ్చి అనుమానాలు రేకెత్తక మానవు.