గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సుకుమార్ షారుఖ్ ఖాన్‌కి ఓ కథ చెప్పాడని, వెంటనే బాలీవుడ్ బాద్ షా ఓకే చేసేశాడని, వీరిద్దరి కాంబోలో ఓ సినిమా ఉండబోతోందన్నది ఆ వార్తల సారాంశం. అంతే కాదు… కథేమిటి? అందులో షారుఖ్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది? అనే విషయాల్ని కూడా చూచాయిగా చెప్పేశారు. బాలీవుడ్ మీడియాలో ఈ వార్త ఎక్కువగా ఫోకస్ అయ్యింది. తెలుగు మీడియాలోనూ గట్టిగానే వినిపించింది. ప్రస్తుతం రామ్ చరణ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు సుక్కు. ఆ తరవాత పుష్ప 3 చేయాలి. ఈమధ్యలో షారుఖ్ సినిమా ఉండొచ్చని అన్నారు.
అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. షారుఖ్ – సుక్కు మధ్య ఎలాంటి భేటీ జరగలేదని, అసలు ఈమధ్య సుకుమార్ ముంబై వెళ్లిందే లేదని సుకుమార్ సన్నిహితులు చెబుతున్నారు. పుష్ప సమయంలో సుకుమార్‌కు బాలీవుడ్ నిర్మాతల నుంచి కొన్ని ఆఫర్లు వచ్చిన మాట నిజమే అని, అయితే సుకుమార్ కు మాత్రం బాలీవుడ్ లో సినిమా చేయాలన్న ఆలోచన లేదని, తెలుగులో సినిమా తీసి, దాన్ని బాలీవుడ్ వరకూ తీసుకెళ్లడమే సుక్కుని ఇష్టమని చెబుతున్నారు. నిజానికి పుష్పతో సుకుమార్ చేసింది అదే. తెలుగులో తీసిన సినిమా, బాలీవుడ్ లో రికార్డు వసూళ్లు తెచ్చుకొంది. ఇక్కడ సుకుమార్ తో పని చేయడానికి చాలామంది హీరోలు క్యూలో ఉన్నారు. చరణ్ సినిమా అవ్వాలి, పుష్ప 3 ఉంది, ప్రభాస్, విజయ్ దేవరకొండ.. ఇలా పెద్ద లిస్టు వెయింటింగ్ లో వుంది. ఇవన్నీ వదులుకొని సుక్కు బాలీవుడ్ వెళ్లడం కష్టమే. మరి ఆ వార్తలు ఎలా పుట్టాయో, ఎవరు పుట్టించారో?