చిరంజీవి 157వ సినిమా ఇటీవలే మొదలైంది. అనిల్ రావిపూడి దర్శకుడు. 2026 సంక్రాంతి బరిలో దింపడమే లక్ష్యంగా ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. చిరు ఫోకస్ అంతా ఈ సినిమాపైనే వుంది. అయితే ఈ హడావుడిలో ‘విశ్వంభర’ని ఎవరూ పట్టించుకోవడం లేదు. 2025 సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది. వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ పై ఎలాంటి క్లారిటీ లేదు. ఆగస్టు 22న విడుదల చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా చిత్రబృందం స్పష్టత ఇవ్వడం లేదు.
విశ్వంభర నుంచి ఓ అప్డేట్ వచ్చి చాలా కాలం అయ్యింది. టీజర్ తరవాత.. అభిమానులకు ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వలేదు. మధ్యలో చాలా పండుగలు వచ్చాయి, వెళ్లాయి. కానీ విశ్వంభర అప్ డేట్ రాలేదు. ఈ సినిమాలో 5 పాటలతో పాటు, కొన్ని బిట్ సాంగ్స్ ఉన్నాయి.వాటిలో ఒక్కటి కూడా విడుదల కాలేదు. విశ్వంభర ఓటీటీ డీల్ క్లోజ్ కాలేదని, బేరసారాలు జరుగుతున్నాయని చాలా కాలంగా చెప్తూనే ఉన్నారు. ఓటీటీ దృష్టిని ఆకర్షించడానికైనా ఓ మంచి పాట విడుదల చేసి ఉంటే బాగుండేది. కానీ అలాంటి ప్రయత్నం కూడా జరగలేదు. మెగా ఫ్యాన్స్ సందర్భం వచ్చినప్పుడల్లా ‘విశ్వంభర’ గురించి ఆరా అడుగుతూనే ఉన్నారు. కానీ యూవీ క్రియేషన్స్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్వర్క్ జరుగుతోంది. అది పూర్తయితే తప్ప, టీమ్ ఓ నిర్ణయానికి వచ్చేలా లేదు. అయితే విశ్వంభర క్రేజ్‌ని అలా సజీవంగా ఉంచాలంటే.. ఈ సినిమా నుంచి ఓ పాటో, ఓ లుక్కో, ఓ పోస్టరో విడుదల చేస్తుండడం మంచిది. కాకపోతే… నిర్మాతల వైపు నుంచే ఎలాంటి స్పందనా లేదు.