‘గేమ్ ఛేంజర్’ నుంచి అప్ డేట్ లేక అల్లాడిపోతున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్. ‘వినాయక చవితికి సూపర్బ్ అప్ డేట్’ అంటూ ఊరిస్తూ… ఫ్యాన్స్ ని చల్లబరిచే ప్రయత్నం చేసింది దిల్ రాజు టీమ్. తీరా చూస్తే… ఓ పోస్టర్ వదిలారు. ‘ఈ నెలలోనే రెండో పాట వస్తోంది’ అంటూ హింట్ ఇచ్చారు. కనీసం పాట ఎప్పుడొస్తుందో కూడా చెప్పలేదు. అంటే పాట కూడా రెడీ కాలేదా? సినిమా మొత్తం పూర్తయిన తరుణంలో పాట విడుదల చేయడానికే మీన మేషాలు లెక్కేస్తూ, ముహూర్తాలు చూసుకొంటున్నారంటే ఎలా? పైగా డిసెంబరులో సినిమా వస్తోందని దిల్ రాజు చెప్పారు. కనీసం విడుదల తేదీ కూడా మెన్షన్ చేయలేదు.
శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. శంకర్ అంటేనే నిదానం, చాదస్తం. అది నిజమే. కానీ ఎన్నాళ్లని రామ్ చరణ్ ఫ్యాన్స్ ని ఇలా వెయిటింగ్ లో పెడతారు? డిసెంబరుకు సినిమా వస్తుందా, రాదా? అనేది ఫ్యాన్స్‌లో ఉన్న పెద్ద అనుమానం. దాన్ని నివృత్తి చేయాలి కదా? సినిమా ఈ నెలలో వస్తుంది, ట్రైలర్ ఈ నెలలో వస్తుంది అని చెప్పిన వాళ్లని చూశాం. ‘పాట ఈ నెలలో’ అంటూ చెప్పడం ఏమిటో అర్థం కాలేదు. వినాయక చవితి అప్ డేట్ అంటే.. కనీసం టీజర్ ఆశిస్తారు. ఒకట్రెండు రోజుల్లో పాటైనా విడుదల చేయాల్సింది. కానీ అదీ జరగడం లేదు. ‘గేమ్ ఛేంజర్’ నుంచి వచ్చిన తొలి పాట పెద్దగా ఆకట్టుకోలేదు. రెండో పాట విషయంలో చిత్రబృందం ఛాయిస్ తీసుకోకూడదు. మంచి పాట రావాల్సిందే. ఆల్బమ్ లో ఉన్న మిగిలిన పాటల్లో ఫ్యాన్స్ కు కిర్రెక్కించేది ఏదో చిత్రబృందం గ్రహించే ఉంటుంది. దాన్ని విడుదల చేయడానికి ఇంత ఆలోచన ఏమిటో? ఓ పోస్టర్ చూపించి దానికే అప్ డేట్ అని ఊరించడంలో అర్థం లేదు. ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మెగా పవర్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. దాన్ని ఈ వినాయక చవితి అప్ డేట్ మరింత పెంచింది.