హైదరాబాద్: ప్రత్యేకహోదాకోసం జగన్ నిరవధిక నిరాహారదీక్ష మొత్తానికి ముగిసింది. మొదట ఫ్లూయిడ్స్ తీసుకోవటానికి నిరాకరించినట్లు వార్తలొచ్చాయిగానీ, తర్వాత ఫ్లూయిడ్స్ తీసుకున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఈ నిరాహారదీక్ష వలన జగన్ ఏమి సాధించారన్నది ఇప్పుడు చర్చనీయాంశమయింది. ప్రత్యేకహోదా డిమాండ్ విషయంలో తాను మిగిలినవారి కంటే ఎక్కువ కృషి చేస్తున్నట్లు(champion of the cause) ప్రజలకు చాటిచెప్పి రాజకీయ ప్రయోజనం పొందాలన్నదే జగన్ లక్ష్యమన్నది బహిరంగ రహస్యమే. అయితే ఈ ఆరు రోజుల దీక్షద్వారా ఆ సందేశాన్ని ప్రజలలోకి ఆయన విజయవంతంగా పంపించగలిగారా అన్నది ఇక్కడ ప్రశ్నార్థకం.
దీక్ష ఇంకా కొంతకాలం జరిగిఉంటే రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగి ఈ విషయం ఇంకా ఫోకస్ అయ్యేదేమోగానీ ఫోకస్ కాకముందే ముగిసిపోవటంతో ఇది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మరోవైపు ఈ తతంగమంతా – రోగీ అదే కోరాడు, వైద్యుడూ అదే ఇచ్చాడు – అన్నట్లుగా ముగియటం విశేషం. దీక్షను భగ్నం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని జగన్‌గానీ, ఆయన మద్దతుదారులుగానీ ప్రతిఘటించలేదు. దీక్ష భగ్నంకావాలనే వారు కోరుకున్నట్లు కనబడుతోంది. దీక్షను కొనసాగించే విషయంలో అసలుకే మోసం వస్తుందేమోనని వారు భయపడ్డారనే వాదన వినిపిస్తోంది. ఆమరణ నిరాహార దీక్షలు చేసే వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి ప్రమాదస్థాయికి చేరగానే ప్రభుత్వం భగ్నం చేస్తుందనే విషయం తెలిసే రాజకీయ నేతలు ధైర్యంగా ఈ దీక్షలలోకి దిగుతారనే ఒక విమర్శ జనబాహుళ్యంలో ఉండనే ఉంది. జగన్ దానికి అతీతమైన స్థాయిలో దీక్షను కొనసాగించితే సమస్యపట్ల ఆయన చిత్తశుద్ధిపై నమ్మకం ఏర్పడి, జనంలో ప్రభావం ఉండేదేమోగానీ, ఇప్పుడైతే అదేమీ లేదనే చెప్పాలి. సినిమా పరిభాషలో చెప్పాలంటే క్లైమాక్స్ ముందే సినిమా అర్థంతరంగా ముగిసినట్లుగా ఉంది.
మరోవైపు ఈ విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి జగన్ ఈ దీక్ష ద్వారా ప్రయోజనం పొందకుండా, ప్రభావం చూపకుండా చేసింది. ఏపీ మంత్రులు నాలుగోరోజునుంచీ దీక్షపై అనుమానాలు వ్యక్తం చేయటం, ఆరోపణలు చేయటం మొదలుపెట్టారు. స్వయంగా డాక్టర్ అయిన మంత్రి కామినేని శ్రీనివాస్తోకూడా అనుమానాలు వ్యక్తం చేయించారు. ఆ ఆరోపణలను తిప్పికొడుతూ, వైసీపీ నేతలు జగన్ రక్తంలో కీటోన్స్ కూడా ఉన్నాయని, కోమాలోకి వెళ్ళే ప్రమాదముందని వాదించారు. దీంతో ప్రమాదముందని వైసీపీ నేతలే చెప్పినట్లవటంతో ప్రభుత్వం పని సులువైపోయింది. తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చి సెలైన్ ఎక్కించేశారు.
రాష్ట్ర ప్రజలకు ఈ దీక్ష వలన ఏమి ఒరిగినా, ఒరగకపోయినా, జగన్ మాత్రం పార్టీపరంగా లబ్ది పొందటం మరో విశేషం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దీక్ష పుణ్యమా అని ఒక చైతన్యం, చురుకుదనం వచ్చింది. పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్సాహం వచ్చింది. దీనిని జగన్ సద్వినియోగం చేసుకుని ప్రధాన ప్రతిపక్షంగా మరిన్ని నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపటితే బాగుంటుంది.