ఈవారం బాక్సాఫీసు కొత్త సినిమాలతో కళకళలాడిపోయింది. చిన్నా చితకా కలిపి దాదాపు 10 సినిమాల వరకూ విడుదలయ్యాయి. అందులో ఖాకి, గృహం, స్నేహమేరా జీవితం, లండన్ బాబులు, ప్రేమతో మీ కార్తీక్… ఇలాంటి సినిమాలున్నాయి. రావడానికి పది సినిమాలొచ్చినా, బాక్సాఫీసు దగ్గర నిలదొక్కుకొనే లక్షణం ఒక్కదాంట్లోనూ కనిపించకపోవడం శోచనీయం. కార్తి ‘ఖాకి’ బాగానే ఉన్నా, ఓ వర్గం ప్రేక్షకులకే పరితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ ప్రయత్నం రుచించకపోవొచ్చు. గృహం కూడా అంతే. ఇది కేవలం హారర్ ప్రియులకు మాత్రమే. అయితే సిద్దార్థ్‌ని నమ్మి సినిమాకు వెళ్లేవాళ్లు ఎంతమంది అనేది ఒకట్రెండు రోజుల్లో తేలిపోతుంది. తమిళంలోలా తెలుగులో ఈ సినిమా హిట్ అయి, భారీ వసూళ్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. లండన్ బాబుబుకు ప్రచారం బాగానే వచ్చినా, అది కూడా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకోలేకపోయింది. స్నేహమేరా జీవితాన్ని పట్టించుకొన్నవాళ్లే లేరు. ఏ సినిమాకీ ఆశించిన స్థాయిలో వసూళ్లు లేకపోవడం నిర్మాతల్ని, బయ్యర్లనీ కలవరపెడుతోంది. మిగిలిన వాటితో పోలిస్తే ఖాకీనే కాస్త బెటర్. వచ్చేవారం `బాలకృష్ణుడు` వస్తోంది. 24న కూడా పెద్ద సంఖ్యలో సినిమాలొస్తున్నా.. రోహిత్ సినిమానే కాస్త ఎట్రాక్ట్ చేస్తోంది. `నెపోలియన్` కూడా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న కథే. ఇవి రెండూ ఏమైనా అలరిస్తాయేమో చూడాలి.