జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మరోసారి జనంలోకి వస్తున్నారు. నవంబర్ 10న అనంతపురంలో సభ ఏర్పాటుచేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఈ సభకు సీమాంధ్ర హక్కుల చైతన్య సభగా పేరు పెట్టారు. సీమ ప్రాంతానికి చెందిన విప్లవ రచయిత తరిమెల నాగిరెడ్డి పేరును సభా ప్రాంగణానికి పెట్టారు. ఆ రోజు సాయంత్రం 4గంటలకు ప్రారంభమయ్యే ఈ సభలో పవన్ కల్యాణ్ ఓ గంటపాటు తన వాగ్ధాటితోనూ…ఆవేశంతోనూ తన అభిమానులను ఉర్రూతలూగించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోనూ, కాకినాడలోనూ ఇవే తరహా సభలలో ప్రసంగించారు. ఆయన ప్రసంగాలు లక్ష్యానికి తగులుతున్నాయో లేదో తెలియదు గానీ, ఒక దశ, దిశ లేకుండా సాగుతున్నాయన్నది నిర్వివాదాంశం. మహాసముద్రంలో పుట్టుకొచ్చే తుపాన్లు ఎక్కడ తీరం దాటతాయో ఎలా ఊహించలేమో… పవన్ కల్యాణ్ చెప్పదలచుకున్న అంశం కూడా అలాగే ఉంటూ వస్తోంది. నేనెవరికీ భయపడనంటూ చెప్పుకొచ్చే పికె వ్యాఖ్యలే దీనికి తార్కాణం.
అమరావతిలో భూముల సేకరణ అంశంలో తాను ఎంతదాకానైనా వెడతానని అప్పట్లో ప్రకటించారు. ఆపై ఆ అంశాన్నే పట్టించుకోలేదు. అమరావతి కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోందన్న ప్రతిపక్షాల విమర్శలు ఆయన దృష్టిని ఆకర్షించలేకపోయాయి. కాపుల రిజర్వేషన్ అంశంలో కూడా పవన్ సూటిగా స్పందించలేదు. ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నపవన్ కల్యాణ్ ఇంతవరకూ ఎవరిని ఏం ప్రశ్నించారో ఇప్పటికైనా స్పష్టం చేయాలి. ఆయన సభలకు హాజరయ్యేది ఎక్కువగా ఆయన అభిమానులే. 18 నుంచి 25ఏళ్ళ లోపు వారే. అంటే ఆవేశంగా ప్రసంగిస్తే వారిని ఆకట్టుకోవచ్చుననేది ఆయన భావనగా ఉన్నట్లుంది. రాజకీయాలకైనా..చదరంగానికైనా..సమస్యల పరిష్కారానికైనా సమయం చాలా ప్రధానం. ఆ టెక్నిక్ ఒకరిని అధికారంలోకి తేవడానికో లేదా ఓడించడానికో ఉపయోగపడుతుంది తప్ప వేరొకదానికి కాదు. అన్ని సార్లూ ఇలాంటి వ్యూహాలు ఫలించవు.
ఎన్టీరామారావు దీన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. సరిగ్గా ఎన్నికలకు తొమ్మిది నెలల ముందు పార్టీని ప్రకటించారు. అలుపెరగకుండా తిరిగారు. వాగ్దానాలు చేశారు. ప్రజల్ని ఆకర్షించారు. ముఖ్యమంత్రి పీఠంపై దర్జాగా కూర్చున్నారు. అదీ టైమింగంటే. ఇప్పుడు పార్టీ పెడతా.. కానీ పోటీచేయను.. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆలోచిస్తాననే మాటలు దేనికి సంకేతం. నెలకో సభ పెట్టి, అభిమానులను కేరింతలు కొట్టించుకుని.. నా వెనక ఇంతమందున్నారనీ, బలం చెక్కుచెదరలేదనీ ఆయన ఎవరికి చెప్పదలచుకున్నారో..అందరికీ సుస్పష్టమే. ఆకర్షణీయమైన పేర్లు పెట్టి.. నాలుగు ఆవేశపూరిత డైలాగులు చెప్పి.. ఎంతో కాలం తోసుకెళ్ళలేరు. ఇప్పటికైనా స్పష్టమైన ప్రణాళిక ప్రకటిస్తే ప్రజల్లో ఆయన పరపతి పెరుగుతుంది. అలా కాకుండా నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోతే నెలానెలా ఓ సభ మాదిరిగానే మిగిలిపోతుంది.
సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి