పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఎంపీలతో ఆయా రాష్ట్రాల పెద్దలు సమావేశమై మన రాష్ట్రానికి ఏం కావాలో.. పార్లమెంట్ సమావేశాల్లో ఏం డిమాండ్ చేయాలో చెప్పి పంపిస్తున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు తమ ఎంపీలను పిలిచి దిశానిర్దేశం చేశాయి. అయితే అన్నింటిలో కెల్లా భిన్నం వైసీపీ. ఆ పార్టీ ఎంపీలకు అధ్యక్షుడు, సీఎం జగన్ రెడ్డి ఏం చెప్పరు.. ఎందుకంటే పార్లమెంట్ లో మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన అనుకుంటారు. రాష్ట్రానికి డిమాండ్లు చేయాల్సిన అవసరం లేదని అనుకుంటారు . దానికి తగ్గట్లుగా నాలుగున్నరేళ్లుగా ఏపీ వాయిస్ పార్లమెంట్ లో వినిపించడం లేదు.
రాష్ట్ర సమస్యల ప్రస్తావనే చేయని ఒకే ఒక్క రాష్ట్రం ఎంపీలు ఏపీ వాళ్లే !
పార్లమెంట్ అంటే… ప్రజాస్వామ్య అత్యున్నత ఆలయం. అక్కడ ప్రస్తావిస్తే… తమ రాష్ట్రం, నియోజకవర్గం సమస్యలు దేశం దృష్టికి తీసుకెళ్లినట్లవుతుంది. తద్వారా పరిష్కారం లభిస్తుంది. అందుకే… అన్ని రాష్ట్రాల ఎంపీలు తమ వాయిస్ ను బలంగా వినిపించాలని అనుకుంటూ ఉంటారు. విచిత్రంగా… ఏపీ కి చెందిన అధికార పార్టీ ఎంపీలు మాత్రం నోరెత్తరు. టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీలు తరచూ సమస్యలపై మాట్లాడుతూంటారు. అయితే వీరు మాట్లాడితే అడ్డుపడటానికి మాత్రం ఎంపీ మిథున్ రెడ్డి అరుపులతో… మరో ఎంపీ తొడకొడుతూ , మీసాలు మెలెస్తూ కేకలతో టీడీపీ సభ్యుల మీదకు వస్తూంటారు. వీరి తీరు చూసి తోటి సభ్యులు నవ్వుకుంటారు కానీ వారి తీరు మారదు. గత నాలుగున్నరేళ్లకాలంలో ఏపీకి సంబంధించి ఎలాంటి సమస్యనూ వైసీపీ ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించలేదు.
ప్రశ్నలు మాత్రం అడుగుతారు !
పార్లమెంట్ సమావేశాలు జరిగితే ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ఇక్కడ మాత్రం ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ప్రతి సమావేశం సందర్భంగా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఖాయం, ప్రత్యేకహోదా రాదు. ముగిసిన అధ్యాయం , రాజధానికి నిధులు ఇచ్చాం.. ఇలాంటి సమాధానాలను ఇప్పించడానికి ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. ఇవి ప్రభుత్వానికి వ్యతిరేకం అనుకుంటారు కానీ.. వినీ వినీ ప్రజలు పాత విషయమేగా అనుకునేలా చేయడం వారి లక్ష్యం. అలాగే అసలు సంబంధం లేని ప్రశ్నలూ అడుగుతూంటారు. ఈ ప్రశ్నలు కూడా పెద్ద బిజినెస్సని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఇలాంటివేమైనా ఉన్నాయేమో కానీ.. ఈ ఒక్క విషయంలో మాత్రమే యాక్టివ్ గా ఉంటారు.
గత ఎంపీలు… అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లుగా పోరాటమే !
గత ప్రభుత్వ హయాంలో…. టీడీపీ ఎంపీలు కేంద్రంలో భాగంగా ఉన్నా… పోరాటం అనే మాటను మర్చిపోలేదు. రాష్ట్రప్రయోజనాల కోసం పరుగులు పెడుతూనే ఉన్నారు. అరుణ్ జైట్లీ, అమిత్ షా వంటి వారిని ఎంత ఇబ్బంది పెట్టారో చెప్పాల్సిన పని లేదు. పోలవరం నిధులు, ప్యాకేజీ నిధులు.. కేంద్ర సంస్థలుఇలా వెంటపడి సాధించుకొచ్చారు. ఇక ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రధాని ఇంటి ముందే ధర్నా చేశారు. ఇప్పుడు వైసీపీకి ప్రజలకు ఏకపక్షంగా ఎంపీల బలం ఇచ్చినా… కనీస పోరాటం చేయలేకపోతున్నారు. చివరికి పార్లమెంట్ లో వాయిస్ వినిపించలేకపోతున్నారు.