కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రకటించినందున పేదలకు సాయం చేయాడానికి ఏపీ సర్కార్ ఐదు కేజీల బియ్యం, కేజీ పప్పు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు.. మంత్రి పేర్ని నాని కూడా… సాయాన్ని ఇంటికే తీసుకొచ్చి ఇస్తారని ప్రకటించారు. వాలంటీర్ల వ్యవస్థ గురించి గొప్పగా చెప్పి.. అద్భుతంగా పని చేస్తుందని కితాబులు అదే పనిగా ఇస్తున్నారు కాబట్టి… వాలంటీర్లతోనే.. ఆ సాయాన్ని లబ్దిదారులకు పంపిణీ చేస్తారని అనుకున్నారు. పథకాలన్నీ డోర్ డెలివరీ చేయడం అనేది వైసీపీ సర్కార్ కాన్సెప్ట్. ఇప్పటికే ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ ఉన్నారు. అది మాత్రమే కాదు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజల్ని బయటకు రావాలని కోరడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే.. అసలు లాక్ డౌన్ ప్రకటించిందే.. ప్రజలెవరూ బయటకు రాకుండా ఉండటానికి. కానీ లాక్ డౌన్ సాయం పొందడానికి లబ్దిదారులంతా.. రేషన్ దుకాణాల వద్దకు రావాలని సమాచారం పంపారు.
నిత్యావసర వస్తువుల కోసమే…కర్ఫ్యూ రిలీఫ్‌ను ఉదయం పదకొండు గంటల వరకే పరిమితం చేసిన ప్రభుత్వం రేషన్ దుకాణాలకు మాత్రం ఒంటి గంట వరకూ చాన్సిచ్చింది. ప్రస్తుతం ఎండాల కాలం ప్రారంభమయింది. ఉదయం తొమ్మిది గంటలకే ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి సమయంలో.. పేదలందర్నీ సాయం తీసుకోవడానికి.. రేషన్ దుకాణాల వద్దకు పిలిపించి.. గంటల తరబడి వెయిట్ చేస్తున్నాయి. సామాజిక దూరం పాటిస్తూ.. వివిధ రకాల భద్రతా ప్రమాణాలు పాటించాల్సి వస్తూండటంతో..రేషన్ పంపిణీ ఆలస్యమవుతోంది. తొలి రోజు..ఏ రేషన్ దుకాణం వద్ద చూసినా పెద్ద ఎత్తున లబ్దిదారులు గుంపులు,గుంపులుగా ఉన్నారు. కరోనా భయం కారణంగా ఐదుగురు కన్నా ఎక్కువ మంది గుమికూడవద్దని.. ప్రభుత్వమేచెబుతూ.. చివరికి.. ప్రభుత్వమే ఇలా గుంపులుగా గుడికూడేలా చేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఐదు కేజీల బియ్యం, కేజీ పప్పు మాత్రమే ఉచితంగా ఇస్తున్నారు. మిగతా సరుకులన్నింటినీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. గతంలో హుదూద్ వచ్చినప్పుడు.. చంద్రబాబు.. మొత్తం పది సరుకులతో రేషన్ ను ఉచితంగా పంపిణి చేశారు. వైట్ కార్డు ఉందా లేదా అన్నది కూడా చూడలేదు. ఇప్పుడు..దాంతో పోల్చి చూస్తూ.. లబ్దిదారులు అసంతృప్తికి గురవుతున్నారు. తమను బలవంతంగా ఖాళీగా కూర్చోబెట్టి.. కనీస సాయం కూడా చేయడం లేదని అసంతృప్తికి గురవుతున్నారు. ఇంతా చేసి.. రూ.వెయ్యి సాయం చేస్తామన్న ప్రభుత్వం.. దాన్ని వచ్చే నెల నాలుగో తేదీ ఇస్తామని చెప్పింది.