రాష్ట్రపతి ఎన్నికలో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు పలికారు కేసీఆర్. హైదరాబాద్లో భారీగా ప్రచారసభ కూడా నిర్వహింప చేశారు. తెలంగాణలో ద్రౌపది ముర్ముకు కేవలం బీజేపీకి ఉన్న మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి. మిగతావన్నీ సిన్హాకే లభించాయి. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థికి తెలంగాణ కీలకం. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలపై టీఆర్ఎస్ నోరు మెదపడం లేదు.
ఉపరాష్ట్రపతి విషయంలో విపక్షాల అభ్యర్థిగా మార్గరేట్ అల్వాను చర్చలు లేకుండానే ప్రకటించేశారు. ఈ కారణంగా మమతా బెనర్జీ మద్దతు ప్రకటించలేమని పేర్కొంది. కానీ టీఆర్ఎస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ మద్దతు ఇచ్చే పరిస్థితి ఉండదన్న వాదన వినిపిస్తోంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడంతో టీఆర్ఎస్ దూరంగా ఉంటుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు అవుతుందని కారణం చెప్పే అవకాశం ఉందంటున్నారు.
మద్దతు ఇస్తే కాంగ్రెస్తో దోస్తానా కట్టినట్లు చర్చలు జరుగుతాయి. దూరంగా ఉంటే స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోయిందనే విమర్శలకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. అందుకే వీలైనంతగా నాన్చి చివరి క్షణంలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఆగస్టు 6న జరిగే పోలింగ్ నాటికి ఉపరాష్ట్రపతికి ఎన్నికలకు తాము గైర్హాజర్ అవుతామనే నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.