శ్రీశైలం జలాశయం శరవేగంగా నిండుతోంది. ఇప్పటికి 855 అడుగుల వరకూ చేరుకుంది. మామూలుగా… 840 అడుగులకు చేరగానే.. పోతిరెడ్డి పాడు నుంచి రాయలసీమకు నీరు తరలించడం ప్రారంభిస్తారు. కానీ ఈ సారి అలాంటి ఆలోచనే చేయడం లేదు. ప్రాజెక్ట్ నిండుతోంది కానీ.. సీమ వైపు చుక్క నీరు పోవడం లేదు. అదే తెలంగాణ సర్కార్ మాత్రం.. శ్రీశైలంలోకి అలా నీరు రాక ప్రారంభం కాగానే ఇలా నీరు ఎత్తిపోసుకోవడం ప్రారంభించింది. శ్రీశైలం నీటి నిల్వ 804 అడుగుల్లో 31 టీఎంసీలు ఉన్నప్పటి నుంచే.. అంటే పది రోజుల కిందటి నుంచే.. కృష్ణాజలాలు ఎత్తిపోసుకుంటోంది. ఇప్పుడు రోజుకు కల్వకుర్తి నుంచి 2,400 క్యూసెక్కులు తరిలిస్తోంది.
రాయలసీమలో తీవ్ర వర్షాభావం ఉంది. శ్రీశైలంలో ఏ మాత్రం నీటి లభ్యత ఉన్నా… సీమకు వరమే. 810 ఆడుగుల నుంచే ముచ్చుమర్రి పంపులు ఆన్ చేయవలసిన అధికారులు పట్టించుకోలేదు. ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని అధికారులు చెబుతున్నారు. 840 అడుగుల దగ్గర్నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా నీరు మళ్లించి బానకచర్ల క్రాస్‌రెగ్యులేటర్ నుంచి కేసీ కాలువ, ఎస్సార్బీసీ, తెలుగుగంగ ద్వారా సాగు, తాగునీరు సీమ జిల్లాలకు అందిస్తారు. ఈ నీటిని సీమ మొత్తం అందించడానికి.. హంద్రీనీవా సుజల స్రవంతి, మాల్యాల ప్రధాన లిఫ్టు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రెడీగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం నీటిని వదిలి పెట్టేందుకు ఆదేశాలు ఇవ్వడం లేదు.
ఇప్పుడు నీటిని ఎత్తిపోస్తే జిల్లాలో నందికొట్కూరు, నంద్యాల, ఆళ్లగడ్డ, పాణ్యం, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలతో పాటు కడప, అనంతపురం జిల్లాలో కేసీ, హంద్రీనీవా కాలువ ద్వారా తక్షణం తాగునీరు ఇవ్వవచ్చు. అంతేకాకుండా వరి నార్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది. వేల కోట్లు ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ఎత్తిపోతల పథకాలు సిద్ధంగా ఉన్నా నీటి ఎత్తిపోతలు చేపట్టకపోడంపై అన్నదాత ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఈపాటికే మాల్యాల లిఫ్టు పంపులు ఆన్‌చేసి కేసీ, హంద్రీ నీవా కాలువలకు నీరు తోడేసే ప్రక్రియ మొదలైంది. ఆవలి ఒడ్డున తెలంగాణ నీరు ఎత్తిపోస్తోంటే ఈవల ఒడ్డున లిఫ్టులు సిద్ధంగా ఉన్నా ఎందుకు నీరు వదలడం లేదనేది చాలా మందికి అర్థం కాని సందేహం. దీనిపై జగన్ ఆలోచన ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.