ఓ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్ల కోసం దర్శకులు, నిర్మాతలు హైప్ కోసం రకరకాలుగా మాట్లాడుతుంటారు. అందులో పదికి ఒకట్రెండు నిజాలుంటాయేమో.? మిగిలినవన్నీ గాలి కబుర్లే. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని, ఈ కాంబినేషన్‌తో మరో సినిమా చేస్తామని, బాలీవుడ్ లో రీమేక్ చేస్తామని ఇలా… బోలెడన్ని మాట్లాడేస్తుంటారు. సినిమా విడుదలయ్యాక.. వాటిని యధావిధిగా మర్చిపోతారు. సినిమా హిట్టయితే ఓకే. లేదంటే అంతే సంగతులు.
వైల్డ్ డాగ్ విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తామని నిర్మాత ప్రకటించేశారు. ఏకంగా అమీర్ ఖాన్ లాంటి హీరోనే లైన్ లోకి తీసుకొచ్చారాయన. తీరా చూస్తే… సినిమా విడుదలై మంచి టాకే వచ్చినా, కలక్షన్లు లేవు. ఈ సినిమాతో నిర్మాతలకు భారీ నష్టాలు ఖాయం అయ్యాయి. ఇప్పుడు ఈ కథని బాలీవుడ్ లో రీమేక్ చేసే ధైర్యం చేయలేరు. అందునా అమీర్ లాంటి హీరోలతో. పైగా.. ఉరి, బేబీ లాంటి సినిమాలు చూసినవాళ్లకు `వైల్డ్ డాగ్` ఏమీ ఆనదు. ఆమాటకొస్తే ఆ రెండు సినిమాల స్ఫూర్తే వైల్డ్ డాగ్ లోనూ కనిపిస్తుంటుంది. సో.. వైల్డ్ డాగ్ రీమేక్ ని ఇక పూర్తిగా మర్చిపోవచ్చన్నమాట.