అధికార పార్టీలకు తాము చేయాలనుకున్న పనులకు కరోనా అడ్డం రాదు. ఎలాంటి కార్యక్రమం అయినా చేసేస్తారు. కానీ.. చేయకూడదనుకున్న పనులు వచ్చేటప్పటికి కరోనా గుర్తొచ్చేస్తుంది. కరోనా వల్ల చేయడం లేదని ఓ స్టేట్మెంట్ ఇచ్చేసి.. అదేదో బాధ్యతగా చేస్తున్నట్లుగా ఫీలైపోతూంటారు. కేంద్రమైనా … రాష్ట్రమైన అదే పరిస్థితి. ఇతర కార్యక్రమాలు అయితే ఏమిటో అనుకోవచ్చు కానీ.. పార్లమెంట్ సమావేశాలను కూడా కరోనా కారణంగా నిర్వహించడం లేదని ప్రకటిస్తే.. కాస్త ఆశ్చర్య పడాల్సిందే. నిబంధనల ప్రకారం… శీతాకాలం సమావేశాలను కేంద్రం నిర్వహిచాల్సి ఉంది.
కానీ శీతాకాల సమావేశాలు లేనట్లేనని స్పష్టం చేసిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద జోషి ప్రకటించేశారు. అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇక నేరుగా జనవరిలో బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తారు. కరోనా లాక్ డౌన్ ఇప్పుడు ఎత్తేశారు. రేపోమాపో టీకా వస్తుందని కేంద్రమే చెబుతోంది. కరోనా భయం అడుగడుగునా ఉన్న సమయంలో కేంద్రం పార్లమెంట్ సమావేశాలను నిర్వహించింది. ఇప్పుడు అత్యంత వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను ఆమోదింపచేసుకుంది.
ఇప్పుడు ఆ చట్టాలపై తీవ్రమైన ఆందోళన నెలకొంది. రైతులు ఢిల్లీని దిగ్బంధిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తే వ్యవసాయ చట్టాలపై సమగ్రమైన చర్చ జరిగే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం సమావేశాలను నిర్వహించకూడదనే నిర్ణయానికి వచ్చింది. కేంద్రం తల్చుకుంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని సమావేశాలు నిర్వహించడం పెద్ద విషయం కాదు. కానీ.. రిస్క్ తీసుకోవాలని కేంద్రం అనుకోలేదని తెలుస్తోంది.