తెలంగాణ రాష్ట్రంలో రెండో ప్రభుత్వం ఏర్పడినప్పటికీ.. మహిళా మంత్రికి అవకాశం దొరకడం లేదు. తొలి ప్రభుత్వం.. మహిళలు లేని కేబినెట్‌తోనే నడిచిపోయింది. మహిళా శిశు సంక్షేమ శాఖను కూడా.. పురుష మంత్రే నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాల్లోనూ.. మహిళలు లేని కేబినెట్లు లేవని.. ఆ పరిస్థితి ఒక్క తెలంగాణలోనే ఉందని ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ ఖాతరు చేయలేదు. రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అయినా చాన్స్ వస్తుందేమోనని… చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ.. వారి ఆశలు అడియాశలు చేశారు కేసీఆర్. పది మందికి కొత్తగా మంత్రుల్ని.. ఎంపిక చేసుకున్నా… వారిలో మహిళలు లేరు.
కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న మంత్రులకు కీలక శాఖలను కేటాయిచారు. సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ఆర్థికశాఖ, ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వ్యవసాయశాఖ, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు పౌరసఫరాల శాఖ కేటాయించనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. నీటిపారుదల, పంచాయతీరాజ్, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాలు తన వద్దనే ఉంచుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాల ప్రకారం.. ఒక్క ఖమ్మం జిల్లాకు మాత్రం.. చోటు దక్కడం లేదు. గత మంత్రివర్గంలోని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కేటీఆర్, హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్నలకు వివిధ సమీకరణాల కారణంగా ఈసారి చోటు దక్కలేదు. గిరిజన, మహిళా కోటా కింద ఎవరూ లేకపోవడంతో.. విస్తరణలో అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో… కేసీఆర్ మహిళలకు అసెంబ్లీ టిక్కెట్లనే.. చాలా పరిమితంగా ఇచ్చారు. వారిలో ముగ్గురే గెలిచారు. ఆదిలాబాద్ నుంచి రేఖా నాయక్, ఆలేరు నుంచి సునీతా మహేందర్ రెడ్డి, మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డి మాత్రమే గెలిచారు. వీరిలో ఇద్దరు రెడ్డి సామాజికవర్గం ఉన్నారు. వారిద్దరూ సీనియర్లే. ఇప్పటికే పది మందిలో ఐదుగురు రెడ్డి సామాజికవర్గం వారు ఉండటంతో.. వారి విషయంలో ఆలోచించినట్లు చెబుతున్నారు. రేఖానాయక్‌కు పదవి ఇస్తే… మహిళా, గిరిజన కోటా పూర్తయ్యేది. కానీ కేసీఆర్ మాత్రం.. ఆమె విషయంలో నిర్ణయం తీసుకోలేదు. దాంతో.. మరోసారి మహిళలు లేని కేబినెట్‌తో తెలంగాణ లో పాలన సాగనుంది. కొత్తగా జరిగే విస్తరణతో.. మంత్రివర్గ సభ్యుల సంఖ్య 12కి చేరుతుంది. మరో ఐదుగురికి మాత్రం అవకాశం ఉంటుంది. వీరిలో మహిళకు చాన్స్ ఉంటుందా లేదా అనేది.. పార్లమెంట్ ఎన్నికల తర్వాతే తేలుతుంది.