మెగా హీరోలు ఈ మధ్య మౌనం వహిస్తున్నారు… ఎందుకో మరి? వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ చిత్రం ఆదివారం ప్రారంభమైంది. వివి వినాయక్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలతో సహా తదితరులు ప్రారంభోత్సవానికి వచ్చారు. అందరిలో వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్నయ్యపై తొలి షాట్‌కి క్లాప్ కొట్టింది. ఇద్దరూ మీడియాతో మాట్లాడతారని అనుకుంటే ఫొటోలకు పోజులు ఇచ్చి వెళ్లిపోయారు. ప్రారంభోత్సవంలో ఎవరూ మాట్లాడలేదు.
మెగా ఫ్యామిలీ మూవీ ప్రారంభోత్సవంలో మాట్లాడకుండా వెళ్లిపోవడం ఇటీవల కాలంలో ఇది రెండోసారి. మొన్నీ మధ్య మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సినిమా ప్రారంభమైంది. చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ తదితర కుటుంబ సభ్యులు అందరూ ప్రారంభోత్సవంలో సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి రెండు ముక్కలు మాట్లాడి మమ అనిపించారు. ఆయనతో పాటు సుకుమార్ కొంచెం మాట్లాడారు. మెగా ఫ్యామిలీ యువ హీరోలు ఎవరూ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. మీడియాకు ఆహ్వానాలు పంపి మాట్లాడకుండా వెళ్లిపోవడం ఏం విడ్డూరమో. ఆ మాత్రం దానికి పిలవడం ఎందుకో?