వైకాపా నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించడమా… ఊహించలేం! ఢిల్లీ వేదికగా గొప్పగా ప్రత్యేక హోదా సాధన ఉద్యమాన్ని సాగించామనీ, అంతకుమించిన స్థాయిలో రాష్ట్రంలో పోరాడుతున్నాం అని వైకాపా చెప్పుకుంటుందిగానీ.. ఈ క్రమంలో హోదా ఇవ్వాల్సిన కేంద్రాన్నీ, ప్రధానినీ ఒక్కసారైనా విమర్శించిన `దాఖలాలు లేవు. పార్లమెంటులో మోడీ సర్కారుపై నామ్ కే వాస్తే అన్నట్టు అవిశ్వాసం పెట్టారుగానీ, అప్పుడు కూడా విమర్శించలేదు. కనీసం ఇప్పుడు కూడా విమర్శించే సందర్భం వచ్చినా.. వైకాపా నేతలకు మనసు రావడం లేదు. తప్పదన్నట్టుగా, ఇది తన అభిప్రాయం మాత్రమే అనే స్టార్ మార్క్ పెట్టిమరీ… వైకాపా నేత అంబటి రాంబాబు ఎంత సున్నితంగా విమర్శించారో..! వెనువెంటనే, సీఎం చంద్రబాబు టాపిక్ వచ్చేసరికి.. ఆయన ఎంత వీరావేశానికి లోనయ్యారో..!
వైకాపా కార్యాలయంలో మీడియాతో అంబటి మాట్లాడుతూ… ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, జనసేన, వామపక్షాలు ఇచ్చిన ఏపీ బంద్ పిలుపును ముఖ్యమంత్రి చంద్రబాబు అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. ఇదే సందర్భంలో మోడీ గురించి మాట్లాడుతూ… ప్రధానమంత్రి కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా నిన్న (అంటే నిరాహార దీక్ష చేశారుగా) వ్యవహరించారన్నది ‘తన’ అభిప్రాయం అని అంబటి నొక్కి చెప్పారు. ఈ దేశాన్ని పాలించాల్సిన వ్యక్తి, పార్లమెంటును నడపాల్సిన బాధ్యత ఉన్న ప్రధానమంత్రి… వారి వైఫల్యాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసే ప్రయత్నం చేశారన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించే విధంగా ప్రధాని వ్యవహరించడం దురదృష్టకరమైన ప్రయత్నం అన్నారు.
ఇక్కడి నుంచి గొంతు సవరించుకున్నారు! అంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టాపిక్ వచ్చిందన్నమాట! ఏపీలో బంద్ కి పిలుపునిస్తే.. దాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడారనీ, బందులు వేరే విధంగా చెయ్యాలని చెప్పి ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. గతంలో కూడా ఇలానే వెళ్లారనీ, కానీ సాధించింది శూన్యమని ఎద్దేవా చేశారు. అనేక తరాల నుంచి నిరసనలు తెలిపే సంప్రదాయం మనదేశంలో ఉందనీ, బంద్ ద్వారా ప్రజల ఆకాంక్షల్ని కేంద్ర ప్రభుత్వాలకు తెలిపే పద్ధతిని మనం అనుసరిస్తున్నామంటూ క్లాస్ తీసేసుకున్నారు. ఆయన తల్చుకుంటే కేంద్ర ప్రభుత్వాల వాహనాలు నిలిచిపోతాయని చంద్రబాబు అన్నారనీ, అలా ఆపితే ఎవరైనా ఊరుకుంటారా అంటూ అంబటి ఆ క్షణంలోనే కేంద్రం సైడ్ తీసుకున్నారు! ఇదీ వైకాపా నేతల వరుస. ప్రధానమంత్రి గురించి చాలా సున్నితంగా విమర్శించడం మొదలెట్టగానే.. ఇది తన అభిప్రాయం మాత్రమే అని డబుల్ కోట్స్ లో అంబటి మాట్లాడారు. ఎక్కడా ఎలాంటి భావోద్వేగానికి లోను కాలేదు. కానీ, చంద్రబాబుపై విమర్శలు మొదలుపెట్టగానే ఆయనకి పూనకం వచ్చినట్టు హావభావ విన్యాసాలు మొదలుపెట్టేశారు. భాజపాని అనాలాన్నా, ప్రధానిని విమర్శించాలన్నా… పాపం, మనసు రావట్లేదు కదా!