జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొద్ది రోజులుగా హైదరాబాద్ లో వరుసగా పార్టీలో నేతల్ని చేర్చుకుంటున్నారు. అందులో ముమ్మిడి వరం నియోజకవర్గానికి చెందిన పితాని బాలకృష్ణకు టిక్కెట్ కూడా ప్రకటించారు. జనసేన అధినేత చేరికల విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు. వరుసగా పార్టీలో నేతలు చేరుతూంటే సంతోషంగానే ఉంటుంది కానీ.. వచ్చే నేతలంతా… అటు తెలుగుదేశం పార్టీలోనో.. ఇటు వైసీపీలోనే టిక్కెట్ దొరికే చాన్స్ లేని వాళ్లే. టిక్కెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదని తెలుసుకన్న తర్వాతే వారంతా జనసేన వైపు చూస్తున్నారు. కనీసం.. రేసులో ఉన్నట్లుగా ఉన్నా.. ఎవరూ జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇలాంటి నేతలను కూడా పవన్ పార్టీలో చేర్చుకుంటున్నారు.
అదే సమయంలో పవన్ కల్యాణ్ గతంలో వలస నేతలు అసలు వద్దే వద్దంటూ … చేసిన ప్రకటనలను మరికొందరు గుర్తు చేస్తున్నారు. రాజకీయ జీవితం కోసం తన పార్టీలో చేరే వారికి అవకాశం ఇవ్వనని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వలస నేతలతోనే పార్టీని నింపేస్తున్నారు. పార్టీ తరపున టిక్కెట్ కూడా.. వలస నేతకే ప్రకటించారు. పైగా ఇప్పుడు చేరుతున్న నేతలంతా..ఉభయగోదావరి జిల్లాలకు చెందిన వారే. ఇతర జిల్లాల నుంచి చేరుతామని వస్తున్న వారు కూడా ఎవరూ లేరు. తనకు యువ నేతలు కావాలని… బుల్లెట్లకు గుండెను అడ్డుపెట్టే యువతకు ప్రాధాన్యం ఇస్తానని పవన్ పదే పదే చెబుతూంటారు. అందు కోసం … జిల్లాల వారీగా ఎంపిక శిబిరాలు నిర్వహించారు. ఎంపికైన వారందరికీ ట్రైనింగ్ ఇచ్చి… వాళ్ల నుంచే నేతల్ని తయారు చేస్తామని చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా ప్రస్తతం జరుగుతోంది.
రాజకీయ వ్యూహాు, చేరికల విషయంలో పవన్ కల్యాణ్ కాంగ్రెస్, వైసీపీల బటలోనే నడుస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పవన్ కల్యాణ్ చెప్పే సరికొత్త రాజకీయానికి.. ఇప్పుడు ఆయన చేస్తున్న రాజకీయానికి సంబంధం లేదన్న విమర్శలూ వస్తున్నాయి ఈ విషయంలో పవన్ కల్యాణ్ తన ప్రత్యేకత చూపకపోతే… ..ఇప్పటి వరకూ జనసేన సిద్దాంతాలకు ఆకర్షితులైన ఓ వర్గం యువత.. దూరమయ్యే ప్రమాదం ఉందనే అంచనాలు వస్తున్నాయి.