వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర పూర్తి చేశారు. పాదయాత్ర పూర్తి కావడమే తరువాయి, ప్రతిపక్ష నాయకుడిగా తాను చేయాల్సింది అంతా చేశాను, ఇక ముఖ్యమంత్రి కావడమే తరువాయి అన్న అభిప్రాయం లోకి వచ్చేశారు. గత రెండు నెలలుగా వైయస్ జగన్ బాడీ లాంగ్వేజ్ చూసినవాళ్లంతా, 2014 ఎన్నికలకు ముందు కూడా ఇదే తరహా ఓవర్ కాన్ఫిడెన్స్ జగన్ ప్రదర్శించేవాడు అని అంటున్నారు. అయితే జగన్ అంచనాలు రాయలసీమ వరకు సరిగానే ఉన్నప్పటికీ, ఉత్తరాంధ్ర కోస్తా ఆంధ్ర ప్రాంతాలలో జగన్ కి ఝలక్ తగిలే అవకాశం ఉందని, ఉత్తరాంధ్ర లోని కొన్ని ప్రాంతాలలో అసలు వైఎస్ఆర్సిపి ని జనాలు పరిగణలోకి తీసుకోవడం లేదని, ఇక్కడ పోటీ కేవలం అధికార టిడిపి కి, జనసేన కు మధ్య ఉంటుందని అక్కడి జనాలు అంటున్నారు.
ఉత్తరాంధ్రలో పుంజుకో లేకపోయిన జగన్
2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఫలితాలు ఆశాజనకంగా రాలేదు. శ్రీకాకుళంలో 10 స్థానాలు, విజయనగరంలో 9 స్థానాలు, విశాఖపట్నంలో 15 స్థానాలు ఉంటే, ఈ మూడు జిల్లాలోనూ ఒక్కో జిల్లాలో కేవలం మూడు సీట్లు మాత్రమే జగన్ సాధించగలిగారు. అయితే ప్రతిపక్షం గా ఉన్న ఈ నాలుగు సంవత్సరాలలో కూడా ఈ మూడు జిల్లాల్లో పెద్దగా పుంజుకో లేకపోయారు.
శ్రీకాకుళం జిల్లాలో దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం సమస్యపై పవన్ కళ్యాణ్ గళం ఎత్తిన తర్వాత ఆ ప్రాంతంలోనే కాకుండా పరిసర జిల్లాల్లో కూడా పవన్ కళ్యాణ్ మీద ప్రజలకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడింది. దీనికి తోడు ఇప్పుడు వైఎస్సార్ సిపి లో ఉన్న ఉత్తరాంధ్ర నాయకుల లో చాలామంది మీద గతంలో నుంచి ఉన్న అవినీతి ఆరోపణలు ప్రజల మస్తిష్కాల్లో ఇంకా సజీవంగా గా ఉన్న కారణంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైఎస్ఆర్సిపి పుంజుకో లేకపోయింది.
తితిలి తుఫాను సమయంలో శ్రీకాకుళం పర్యటించని జగన్
దీనికి తోడు తితిలి తుఫాను సమయంలో శ్రీకాకుళం మొత్తం అతలాకుతలం అయితే, పక్క జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్న జగన్ ఎమోషనల్ గా స్పందించి వెంటనే అక్కడకు వెళ్ళకుండా, తాపీగా తుఫాను ముగిసిన తర్వాత పాదయాత్రలో భాగంగా అక్కడికి వెళ్లడం కూడా అప్పట్లో విమర్శలకు దారి తీసింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం లో మకాం వేసి, అక్కడి ప్రజలతో మమేకం అయినప్పటికీ ఆ సంగతులు మీడియా ఛానళ్లలో చూపించకపోవడంతో, శ్రీకాకుళం వాసులు పవన్ కళ్యాణ్ చేసిన సహాయం తాము గుర్తుంచుకుంటాం అంటూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే అవి వైరల్ గా మారిన విషయం కూడా తెలిసిందే.
కిల్లి కృపారాణి కి టికెట్లు ఇస్తారా?
మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, కాంగ్రెస్ పార్టీని వదిలి ఈ మధ్య వైఎస్ఆర్సిపిలో చేరిన విషయం తెలిసిందే. శ్రీకాకుళంలో ఇన్నేళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులపై నమ్మకం లేకనే జగన్ కిల్లి కృపారాణి పార్టీలో చేర్చుకున్నాడు అంటూ మరొక పక్క విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో వైఎస్సార్సీపీ లోకి చేరడానిక కంటే ముందు చిరంజీవితో ఆవిడ భేటీ అయినట్లు, జనసేన లో చేరడానికి ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ ఆమెను పార్టీలో చేర్చుకునే విషయంలో ఆసక్తి ప్రదర్శించకపోవడం తో ఆమె వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారు. జగన్ ఇప్పుడు ఆమె కి టికెట్ ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంతకాలం కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడే వైఎస్ఆర్సిపిలో చేరిన ఆవిడ కి, ఒకవేళ పోటీ చేసినా, ప్రజలు ఏ మేరకు ఓట్లు వేస్తారు అన్నది వేచి చూడాల్సి ఉంది. అలాగే విజయనగరం జిల్లా కి వస్తే, బొత్స సత్యనారాయణ విషయంలో కూడా, అప్పటి వ్యతిరేకత ఇంకా కొనసాగుతూ ఉంది అని వార్తలు వస్తున్నాయి.
ఏది ఏమైనా ఈ ముప్పై నాలుగు స్థానాలలో, గతంలో గెలిచిన 9 స్థానాలను జగన్ నిలబెట్టుకుంటే అదే గొప్ప అని, ఈ మూడు జిల్లాల వరకు అయితే జగన్ పేరు ఊసు లో కూడా లేదని ఇక్కడి ప్రజలు అభిప్రాయపడుతూ ఉండడంతో, మరి ముఖ్యమంత్రి కావాలన్న జగన్ ఆశలు ఈ ఎన్నికల్లో అయినా ఏ మేరకు నెరవేరుతాయా అన్నది వేచి చూడాల్సి ఉంది