ఏపీ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ. ఆయనకు విద్యాశాఖ ఇచ్చారు. ఆ శాఖలో ఏం జరుగుతుందో ఆయనకు తెలియడం లేదు. జీవోలు వచ్చేస్తున్నాయి. ఇలా ఎలా వస్తాయంటే.. అది అంతే అనే సమాధానం వస్తోంది. సరే అని సమీక్ష చేద్దామంటే సగం మంది అధికారులు రారు. వచ్చిన వారు బొత్స ఏం చెప్పారో పట్టించుకోరు. ఎలాంటి ఆదేశాలిచ్చినా లైట్ తీసుకోరు. పాఠశాలల విలీనంపై రచ్చ జరుగుతూంటే.. అలాంటి చర్యలొద్దని ఆయన ఆదేశించారు. కానీ పట్టించుకున్న వారు లేరు.
నిజానికి ప్రభుత్వంలో జూనియర్ మంత్రులు కొంత మంది సూపర్ పవర్ ఫుల్గా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్య మంత్రి విడదల రజనీ ఏదైనా ఆస్పత్రికి ఆకస్మిక తనిఖీకి వెళ్లినా.. లేదా తన శాఖపై సమీక్ష పెట్టినా అధికారులు పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు. ఆమె సీఎం రేంజ్లో సమీక్షలు చేస్తున్నారు. అదే ఇతర సీనియర్ మంత్రులు ఎవరైనా సమీక్ష చేస్తే అది ఈసురోమంటూ సాగుతోంది. మంత్రి బొత్స అయినా.. మేరుగు నాగార్జున అయినా అదే పరిస్థితి.
బొత్స సత్యనారాయణ పరిస్థితి దారుణంగా ఉందని వైసీపీలోనే చర్చ జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగా ఆయనను అవమానిస్తున్నారని.. అంటున్నారు. ఈ అంశంపై బొత్స కూడా అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. నాడు- నేడు రెండోదశ పనుల విషయంలో బొత్స ఆసక్తిగా ఉన్నారు. అందుకే ఆయన పెద్దగా బయటపడటం లేదని చెబుతున్నారు . అయితే ఆ ప నులైనా ఆయన కనుసన్నల్లో జరుగుతాయా అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.