కాపులను బిసిలలో చేర్చడానికి కమీషన్ ను నియమించాలన్న రాష్ట్రమంత్రి వర్గనిర్ణయం కాలయాపన ఎత్తుగడగానే ముద్రగడ పద్మనాభం మద్దతుదారులు నమ్ముతున్నారు. పద్మనాభం పిలుపు మేరకు తునిలో జనవరి 31 న జరిగే కాపు మహాసభ లో ఏమార్పూ లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఏ రాజకీయపార్టీలోనూ లేని ప్రజానాయకుడు ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్ పై ఆ వర్గం నాయకులు మేధావులతో సుదీర్ఘమైన చర్చలు జరిపారు. రాజకీయంగా అధికారంలోకి వస్తే కాపు సమస్యలు పరిష్కరించుకోవచ్చన్న సూచనలను ముద్రగడ తిరస్కరించారు.” ఇందువల్ల అధికారంలోకి వచ్చిన వారు, వారి ప్రభావం పడే మరికొందరు ఎదుగుతారేమోకాని కాపుల్లో పేదలు పేదలుగానే వుండిపోతారు. సామాజికంగా ఆర్ధికంగా కాపులు ఎదగాలంటే రాజకీయపరమైన సర్దుబాట్లు కాక రాజ్యాంగ పరంగా చట్టబద్ధమైన హక్కులు సాధించవలసిందేనని” నిర్ధారించుకున్నాకే ఆయన కాపు మహాసభకు జనవరి 31 ముహూర్తంగా నిర్ణయించారు.
సంక్రాంతి తర్వాత పొలం పనులు అయిపోతాయి కనుక వ్యవసాయరంగంలో వున్న బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాల వారంతా పాల్గొనడానికి వీలుగా సభకు ఆ తేదీని నిర్ణయించారు. చంద్రబాబు పాదయాత్ర సమయంలోనూ, 2014 ఎన్నికల ప్రచార సభల్లోనూ కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయించుకోవడమే మహాసభ ఎజెండా. కాపులను బిసిల్లో చేర్పించుకోవడం, వీరి సంక్షేమానికి ఏటా 1000 కోట్లరూపాయలు ఖర్చు చేయించుకోవడం తప్ప
మరో డిమాండు లేదు ” ఇలా రోడ్డున పడటం ఏ రాజకీయపార్టీకీ, ఏకులానికీ వ్యతిరేకం కాదు. ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచిస్తే పుట్టగతులు వుండవు” అంటున్నారు ముద్రగడ.
ముద్రగడ పద్మనాభం మిత భాషి. ముందే క్షుణ్ణంగా చర్చించుకుని, ఆలోచించుకుని, కార్యక్రమాన్ని సిద్ధం చేసుకుంటారు. ఆమేరకు పోస్టర్లు, పాంప్లెట్లు సిద్ధమౌతాయి. విలేకరుల ప్రశ్నలకు ఆయన సహాయకులు ఆ మెటీరియల్ నే చేతికందిస్తారు. విషయం స్పష్టంగా వుంటుంది కనుక అడగడానికి ఏమీ వుండదు.
మహాసభకు ముద్రగడ పిలుపు ఇచ్చినప్పటి నుంచీ రాష్ట్రం నలుమూలల నుంచీ బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాల వారు, ఆయన అభిమానులు తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలోని కిర్లంపూడిలో ఆయన నివాసానికి వెళ్ళి మద్దతు ప్రకటించి వెళుతున్నారు. ఈ సందర్శకులు తక్కువలో తక్కువ రోజుకి 100 మందైనా వుంటున్నారు. వీరిలో మోటారు బైకు మీద వచ్చే యువకులు నడి వయసులో ప్రవేశిస్తున్న వారే అధికం!
ముద్రగడ వంటివారి వల్ల ఆతిధ్యానికి తూర్పుగోదావరి జిల్లా పేరుపడిందో, తూర్పు గోదావరి జిల్లా అతిధి మర్యాదల సాంప్రదాయాన్ని ముద్రగడ పాటిస్తున్నారో తెలియదుగాని ఆయన నివాసానికి వెళ్ళిన వారందరికీ మసాలా ఉప్మా వడ్డిస్తారు. ఇది భోజనానికి ఏమాత్రం తక్కువ కాదు. ఆహార సదుపాయం లేని ఆ చిన్న గ్రామంలో ఇలాంటి ఏర్పాటు అవసరమే మరి!